తీర్థ ప్రసాదాలు తప్పనిసరిగా తీసుకోవాలా ?

తీర్థ ప్రసాదాలు తప్పనిసరిగా తీసుకోవాలా ?
ఆలయానికి వెళ్లి దైవదర్శనం చేసుకున్న తరువాత, తీర్థప్రసాదాలు కళ్లకి అద్దుకుని స్వీకరించడం జరుగుతుంది. తీర్థప్రసాదాలు తీసుకోవడం వల్లనే ఆలయ దర్శనం యొక్క ఫలితం పరిపూర్ణంగా లభిస్తుందని భావిస్తుంటారు. తీర్థప్రసాదాలు అనేవి ఆయా ప్రాంతాలను బట్టి మారుతూ వుంటాయి.

కొన్ని ప్రాంతాల్లో తులసినీరు ... కోనేటినీరు ... పాలు ... పానకం ... అభిషేకం చేయబడిన పంచామృతాలు తీర్థంగా ఇస్తుంటారు. ఇక గురువాయూర్ లో నువ్వుల నూనెను తీర్థంగా ఇస్తుంటారు. ఇక తిరుమల ... శ్రీ కాళహస్తి ... శిరిడీ ... పూరీ ... శబరిమలై వంటి క్షేత్రాల్లో ప్రసాదం ప్రత్యేకతను సంతరించుకుని వుంటుంది.

ఇలా ప్రాంతాలు దాటుకుని వెళుతున్నాకొద్ది అక్కడి పద్ధతిని అనుసరిస్తూ తయారు చేయబడిన తీర్థప్రసాదాలు కొత్తగా అనిపిస్తూ వుంటాయి. అయితే కొందరు ఆ తీర్థ ప్రసాదాలను అదోలా చూడటం ... వాటిని తీసుకోకుండానే రావడం చేస్తుంటారు. ఇంకొందరు అయిష్టంగా తీర్థం తీసుకుని ... పరిచయంలేని రుచి కావడం వలన ప్రసాదాలను కొంచెం తిని మిగతాది పారేస్తుంటారు.

ఈ విధంగా చేయడం ఆ క్షేత్రాన్ని ... అక్కడి దైవాన్ని అవమానపరిచినట్టు అవుతుంది. అలా వ్యవహరించినందుకు దోషాన్ని మూటగట్టుకో వలసి వస్తుంది. అందువలన తీర్థ ప్రసాదాల విషయంలో ఆయా ప్రాంతాల పద్ధతులను దృష్టిలో పెట్టుకుని, భక్తి శ్రద్ధలతో స్వీకరించడం చేయాలి. అప్పుడే భగవంతుడు అనుగ్రహిస్తాడు ... తన దర్శన ఫలితాన్ని అందజేస్తాడు.
Get the ap7am app Free · Opens in one tap Install

More Bhakti Articles