అష్టకష్టాలని వేటిని అంటారు ?

సాధారణంగా అష్టకష్టాలు అనే మాట ఎక్కువగా వినడం జరుగుతూ వుంటుంది. ఫలానా నిర్ణయం తీసుకోవడం వలన అష్టకష్టాలు పడుతున్నట్టుగా కొందరు చెబుతుంటారు. వ్యాపార సంబంధమైన విషయాల్లో భాగస్వాములు మోసం చేయడం వలన అష్టకష్టాలు పడుతున్నట్టుగా మరికొందరు చెబుతుంటారు. నిజానికి ఒకే కష్టాన్ని అనుభవిస్తున్నప్పటికీ, తాము అష్టకష్టాలు పడుతున్నామని కొంతమంది చెప్పుకుంటూ వుంటారు. అందుకు కారణమేవిటంటే అష్టకష్టాలు అంటే ఎనిమిది రకాలైన కష్టాలనే అవగాహన వాళ్లకి లేకపోవడమే.

అప్పులపాలు కావడం .. ఇతరులను యాచించే పరిస్థితి రావడం .. ముసలితనం కారణంగా శరీరం దేనికీ సహకరించక పోవడం .. దరిద్రాన్ని అనుభవిస్తూ వుండటం .. దొంగతనాలు చేయవలసి రావడం .. ఇతరులు ఎంగిలి చేసిన పదార్థాలను తినవలసి రావడం .. దీర్ఘవ్యాధుల బారిన పడటం ... భార్యా వియోగాన్ని అనుభవించవలసి రావడం .. ఈ ఎనిమిదింటినీ అష్టకష్టాలు అంటారు. ఏక కాలంలో వీటన్నిటి బారిన పాడినప్పుడు అష్టకష్టాలు పడుతున్నట్టు అవుతుంది.

అప్పుచేసి తీర్చకపోయినా .. దొంగతనంచేసి పట్టుబడినా .. ఎంగిలి పదార్థాలు తినవలసి వచ్చినా అంతకు మించిన అవమానం లేదు. అప్పుడే మనిషి మానసికంగా మరణించినట్టు భావిస్తాడు. ఇక ముసలితనం .. అప్పుడు వచ్చే వ్యాధులు ... చికిత్స చేయించుకోలేని దారిద్ర్యం ... ఓదార్పును ఇచ్చే భార్య లేకపోవడం నిజంగా దుర్భరం. మరణమే మేలు అనిపించేవే అష్టకష్టాలు. మనం పడుతున్న కష్టాల్లో ఇవేవి లేకపోతే, అవి తాత్కాలిక ఇబ్బందులేనని గ్రహించాలి.

More Bhakti Articles