సంపదల రాకను సూచించే బల్లిపాటు

సంపదల రాకను సూచించే బల్లిపాటు
ఇంట్లో గోడపై బల్లులు తిరుగుతూ వున్నా ... అవి చిత్రమైన శబ్దంతో అప్పుడప్పుడు అరుస్తూ వున్నా ఎవరూ పెద్దగా పట్టించుకోరు. గోడపై బల్లి పాకడం వల్లగానీ, పలకడం వల్లగాని ఎవరికీ ఎలాంటి అంతరాయం కలగకపోవడమే అందుకు కారణమని చెప్పుకోవచ్చు. అయితే బల్లి మీద పడటం వలన ... అది పలకడం వలన అనేక ఫలితాలు ఉంటాయని శాస్త్రం చెబుతోంది.

బల్లి పలకడం వలన కలగబోయే ఫలితాలను గురించి తెలుసుకునే వాళ్లు చాలా తక్కువ. ఇక బల్లి పడింది అంటే మాత్రం దాని ఫలితం ఎలా వుంటుందో తెలుసుకునేంత వరకూ మనఃశాంతిగా వుండని వాళ్లు చాలామంది కనిపిస్తుంటారు. ఇక బల్లి పడిన వారాన్ని బట్టి ... అది పడిన ప్రదేశాన్ని బట్టి ఫలితం మారుతూ వుంటుందని శాస్త్రం చెబుతోంది. అంతే కాకుండా పిల్లలపై బల్లిపాటు వారిపై ఎలాంటి ప్రభావం చూపదని అంటోంది. ఇక పురుషులకు కుడివైపున ... స్త్రీలకు ఎడమవైపున బల్లిపాటు శుభాలను కలిగిస్తుందని గ్రహించాలి.

ఈ నేపథ్యంలో శరీరంపై కొన్ని ప్రదేశాల్లో బల్లిపడటం సంపదల రాకను ముందుగా తెలియజేస్తుందని చెప్పబడుతోంది. తలపై బ్రహ్మ రంధ్రమునకు వెనుకభాగంలో బల్లిపడటం వలన సంపదలు కలుగుతాయి. అలాగే కుడి కంటిపై పడినా ... కుడి చెవిపై పడినా అనూహ్యమైన రీతిలో సంపదలు చేకూరతాయి. ఇక కనుబొమలకు కుడివైపున బల్లిపాటు సంపదల రాకను సూచిస్తుంది. మీసం గల ప్రదేశంలో ఏ వైపున బల్లిపడినను అది సంపదలకు సంకేతమనే చెప్పబడుతోంది.

ముఖభాగంపై బల్లిపాటు ఆకస్మికంగా కలిసివచ్చే సంపదలను సూచిస్తుంది. పొట్టపై ... నడుము మధ్య భాగంలోను .. ఎడమ పిరుదుపై పడటం వలన సిరిసంపదలు తలుపు తడతాయి. ఇక ఎడమ అరికాలుపైన బల్లిపడటం కూడా సంపదల రాకను తెలుపుతుంది. కుడి అరచేతి పైన ... ఎడమ చేతి గోళ్లపైన బల్లిపాటు సంపదలను కలిగిస్తాయని చెప్పబడుతోంది. ఇక ఈ ప్రదేశాల్లో బల్లిపడటం వలన జరగనున్నది మంచేకదా అని ఊరుకోకూడదు. తప్పనిసరిగా తలస్నానం చేసి, పూజా మందిరంలో దీపారాధన చేయవలసి వుంటుంది.

More Bhakti Articles