మ‌రోసారి ఐపీఎల్‌లో ఫిక్సింగ్ క‌ల‌క‌లం..!

  • ఐపీఎల్‌-2025 సీజ‌న్‌లో దారుణంగా ఆడుతున్న ఆర్ఆర్‌
  • గ‌త రెండు మ్యాచుల్లో గెలుపు ముంగిట బోల్తా
  • ఈ నెల 19న ల‌క్నో మ్యాచ్‌లో ఆఖ‌రి ఓవ‌ర్‌లో 9 ర‌న్స్ చేయ‌లేక‌పోయిన వైనం
  • ఈ నేప‌థ్యంలో ఆర్‌సీఏ అడ్ హాక్ కమిటీ కన్వీనర్ జైదీప్ బిహానీ ఫిక్సింగ్ ఆరోప‌ణ‌లు
ఈసారి ఐపీఎల్-2025 సీజ‌న్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ (ఆర్ఆర్‌) జ‌ట్టు అనుకున్న స్థాయిలో రాణించ‌లేక‌పోతోంది. ఆ జట్టు ప్రస్తుతం రెండు విజయాలు, ఐదు పరాజయాలతో ఎనిమిదో స్థానంలో ఉంది. ఇక‌, గెలుపు ముంగిట బోల్తా ప‌డ‌డం అభిమానుల‌ను క‌ల‌వ‌ర పెడుతోంది. గ‌త రెండు మ్యాచుల్లో ఇదే జ‌రిగింది. ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ)తో జరిగిన మ్యాచ్ లో చివరి ఓవర్‌లో కేవలం తొమ్మిది పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైంది. ఆ త‌ర్వాత‌ సూపర్ ఓవర్‌లో మ్యాచ్‌ను కోల్పోయింది. 

అలాగే లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ)తో ఈ నెల 19న‌ జరిగిన మ్యాచ్ లో కూడా మళ్లీ చివరి ఓవర్‌లో తొమ్మిది పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమయ్యారు. రెండు ప‌రుగుల తేడాతో ఆర్ఆర్ ఓడిపోయింది. ఇలా ఈజీగా గెల‌వాల్సిన ఈ మ్యాచ్‌లో ఓడిపోవ‌డంతో ఆ జ‌ట్టుపై ఫిక్సింగ్ ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. 

రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ (ఆర్‌సీఏ) అడ్ హాక్ కమిటీ కన్వీనర్ జైదీప్ బిహానీ, ఎల్ఎస్‌జీతో జరిగిన మునుపటి మ్యాచ్‌లో ఆర్ఆర్‌ ప్రదర్శనపై తీవ్రమైన ఆందోళనను లేవనెత్తారు. చివరి ఓవర్‌లో గెలవడానికి కేవలం తొమ్మిది పరుగులు మాత్రమే అవసరమైనప్పుడు ఒక జట్టు గేమ్‌ను ఎలా ఓడిపోతుందని ఆయ‌న‌ ప్రశ్నించారు. 

చివ‌రి ఓవ‌ర్‌లో చోటుచేసుకున్న నాట‌కీయ‌ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే మ్యాచ్ ఫిక్స్ అయిందని ఒక చిన్న పిల్లవాడికి కూడా అర్థం అవుతుంద‌ని ఆయన అన్నారు. వెంట‌నే ఈ వ్య‌వ‌హారంపై విచార‌ణ జ‌ర‌పాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. కాగా, బిహానీ ఆరోప‌ణ‌ల‌పై బీసీసీఐ ఎలా స్పందిస్తుందో చూడాలి.  


More Telugu News