Mohanlal: మోహన్ లాల్ కు మాతృవియోగం... స్పందించిన చిరంజీవి, కమల్ హాసన్

Mohanlal Loses Mother Condolences From Chiranjeevi Kamal Haasan
  • కొచ్చిలోని నివాసంలో కన్నుమూసిన మోహన్ లాల్ తల్లి శాంతకుమారి
  • గత కొంతకాలంగా వయోభారంతో కూడిన అనారోగ్య సమస్యలతో చికిత్స
  • మోహన్ లాల్ ఇంటికి వెళ్లి పరామర్శించిన మమ్ముట్టి దంపతులు
  • స్నేహితులం అంతా నీకు తోడుగా ఉంటామన్న కమల్ హాసన్
  • రేపు తిరువనంతపురంలో జరగనున్న అంత్యక్రియలు
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ మాతృమూర్తి శాంతకుమారి (90) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, కొచ్చిలోని ఏలమక్కర నివాసంలో మంగళవారం తుదిశ్వాస విడిచారు.

ఈ వార్త తెలియగానే సినీ ప్రముఖులు మోహన్ లాల్‌ను పరామర్శిస్తున్నారు. మలయాళ స్టార్ మమ్ముట్టి తన అర్ధాంగి సుల్ఫత్‌తో కలిసి మోహన్ లాల్ ఇంటికి వెళ్లి నివాళులర్పించారు. పలువురు అగ్రనటులు సోషల్ మీడియా వేదికగా తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.

టాలీవుడ్ అగ్రనటుడు చిరంజీవి స్పందిస్తూ.. "నా మిత్రుడు మోహన్ లాల్, మీ అమ్మగారిని కోల్పోవడం పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. అమ్మ ఉనికి మాటల్లో చెప్పలేని విధంగా మనల్ని తీర్చిదిద్దుతుంది. ఆమె ప్రేమ ఎప్పుడూ బలాన్ని, ఓదార్పును ఇస్తుంది" అని ట్వీట్ చేశారు.

అలాగే కమల్ హాసన్ ఎక్స్ వేదికగా.. "సోదరా మోహన్ లాల్.. ఈ సమయంలో నిన్ను నువ్వే ఓదార్చుకోగలవు. స్నేహితులం అంతా ఎప్పటిలాగే నీకు తోడుగా ఉంటాం. ఎంత ఓదార్చినా ఈ లోటును పూడ్చలేము" అని ధైర్యం చెప్పారు.

రేపు అంత్యక్రియలు
శాంతకుమారి పార్థివదేహాన్ని అంత్యక్రియల కోసం తిరువనంతపురానికి తరలించనున్నారు. బుధవారం (డిసెంబర్ 31) అక్కడ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మోహన్ లాల్ తండ్రి విశ్వనాథన్ నాయర్ కేరళ మాజీ లా సెక్రటరీ కాగా, ఆయన 2005లో మరణించారు.
Mohanlal
Mohanlal mother
Santha Kumari
Chiranjeevi
Kamal Hassan
Malayalam actor
Tollywood
Condolences
Death
Mammootty

More Telugu News