Jennifer Lopez: జెన్నిఫర్ లోపెజ్ ఇక పెళ్లి జోలికి వెళ్లదట!

Jennifer Lopez Reportedly Done with Marriage After Ben Affleck Divorce
  • పూర్తిగా కెరీర్, పిల్లల పెంపకంపైనే దృష్టి
  • ఈ ఏడాది జనవరిలో బెన్ అఫ్లెక్‌తో విడాకులు
  • డేటింగ్ యాప్స్‌ను ఉపయోగించనని స్పష్టం చేసిన నటి
ప్రముఖ హాలీవుడ్ నటి, పాప్ సింగర్ జెన్నిఫర్ లోపెజ్ (56) ప్రస్తుతం తన వ్యక్తిగత జీవితంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. తన మాజీ భర్త బెన్ అఫ్లెక్ (53) నుంచి విడిపోయిన తర్వాత ఆమె మరో రిలేషన్‌షిప్‌లో లేరని, ప్రస్తుతం పూర్తిగా సింగిల్ లైఫ్‌పైనే దృష్టి సారించారని తెలుస్తోంది. ఇప్పుడు ఆమె ప్రాధాన్యత కేవలం తన కెరీర్, పిల్లలేనని సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి.

'పీపుల్' మ్యాగజైన్ కథనం ప్రకారం.. జెన్నిఫర్ లోపెజ్ ప్రస్తుతం ఎవరితోనూ డేటింగ్ చేయడం లేదు. మూడో భర్త మార్క్ ఆంథోనీతో కలిగిన కవల పిల్లలు 17 ఏళ్ల మాక్స్, ఎమ్మెల పెంపకం, తన వృత్తిపరమైన పనులతోనే ఆమె బిజీగా ఉన్నారు. ఆమె ప్రస్తుతం ఎంతో సంతోషంగా, సంతృప్తిగా ఉన్నారని సమాచారం. 

2025 జనవరిలో బెన్ అఫ్లెక్‌తో జెన్నిఫర్ విడాకుల ప్రక్రియ పూర్తయింది. 2024 ఆగస్టు 20న ఆమె విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. 2022లో వీరిద్దరూ లాస్ వెగాస్, జార్జియాల్లో ఘనంగా వివాహం చేసుకున్నారు. అయితే రెండేళ్లకే మనస్పర్థల కారణంగా విడిపోయారు.

గతంలో 'ఇంటర్వ్యూ' మ్యాగజైన్‌తో మాట్లాడిన జెన్నిఫర్.. తాను సింగిల్ లైఫ్‌ను ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. "గత 25, 30 ఏళ్లుగా వేర్వేరు సవాళ్లతో కూడిన బంధాల్లో ఉన్నాను. ఇప్పుడు ఎవరి కోసమో వెతకడం లేదు. స్వేచ్ఛగా ఉండాలనుకుంటున్నాను" అని ఆమె పేర్కొన్నారు. అంతేకాకుండా, తాను పాత పద్ధతులను ఇష్టపడతానని, డేటింగ్ యాప్స్ ఉపయోగించే ఆలోచన తనకు లేదని జెన్నిఫర్ స్పష్టం చేశారు.

జెన్నిఫర్ లోపెజ్ కు గతంలో నాలుగు పెళ్లిళ్లు జరిగాయి. 1997లో ఓజాని నోవాను పెళ్లాడగా, ఆ బంధం ఏడాదికే విచ్ఛిన్నమైంది. 2001లో క్రిస్ జూడ్ ను వివాహం చేసుకున్నారు. అయితే ఈ జోడీ 2003లో విడిపోయింది. మూడో భర్త మార్క్ ఆంథోనీతో మాత్రమే జెన్నిఫర్ లోపెజ్ సుదీర్ఘకాలం వైవాహిక జీవితం గడిపారు. 2004లో వీరిద్దరూ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టగా... 2014లో విడిపోయారు. ఆ తర్వాత బెన్ అఫ్లెక్ ను పెళ్లి చేసుకోగా, ఈ కాపురం మూడేళ్ల పాటు సాగి 2025లో విడాకులతో ముగిసింది. 
Jennifer Lopez
Ben Affleck
divorce
marriage
single life
dating
Mark Anthony
Hollywood
actress
pop singer

More Telugu News