Harry Brook: టీ20 వరల్డ్ కప్ కు ఇంగ్లండ్ జట్టు ఇదే... జట్టులో ఆశ్చర్యకరమైన మార్పులు!

Harry Brook to Captain England at T20 World Cup 2026
  • 2026 టీ20 ప్రపంచకప్ కోసం ఇంగ్లండ్ జట్టు ప్రకటన
  • స్టార్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్‌కు దక్కని చోటు
  • రూ.13 కోట్లతో ఎస్‌ఆర్‌హెచ్ కొనుగోలు చేసినా జాతీయ జట్టులో మొండిచేయి
  • గాయపడినా గానీ, జోఫ్రా ఆర్చర్‌పై నమ్మకం ఉంచిన సెలెక్టర్లు
  • తొలిసారిగా టీ20 జట్టులోకి వచ్చిన ఫాస్ట్ బౌలర్ జోష్ టంగ్
ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) 2026 టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది సభ్యులతో కూడిన ప్రాథమిక జట్టును మంగళవారం ప్రకటించింది. యువ ఆటగాడు హ్యారీ బ్రూక్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. 

అయితే, ఈ జట్టులో విధ్వంసకర బ్యాటింగ్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్‌కు చోటు దక్కకపోవడం క్రీడావర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇటీవల జరిగిన ఐపీఎల్ 2026 మినీ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇతని కోసం ఏకంగా రూ.13 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఫ్రాంచైజీ క్రికెట్‌లో భారీ డిమాండ్ ఉన్నప్పటికీ, జాతీయ జట్టు సెలెక్టర్లు మాత్రం అతన్ని పక్కన పెట్టడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది.

లివింగ్‌స్టోన్‌తో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ జేమీ స్మిత్‌కు కూడా ఈ జట్టులో చోటు దక్కలేదు. మరోవైపు, ఆస్ట్రేలియాతో జరిగిన యాషెస్ సిరీస్‌లో చివరి రెండు టెస్టులకు గాయం కారణంగా దూరమైన స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌ను ప్రపంచకప్ జట్టులోకి తీసుకున్నారు. అయితే, ప్రపంచకప్‌కు సన్నాహకంగా శ్రీలంకతో జరిగే వన్డే, టీ20 సిరీస్‌లకు మాత్రం ఆర్చర్ దూరంగా ఉండనున్నాడు. 

ఇక టెస్టుల్లో సత్తా చాటుతున్న ఫాస్ట్ బౌలర్ జోష్ టంగ్ తొలిసారిగా టీ20 జట్టులోకి ఎంపికయ్యాడు. శ్రీలంక సిరీస్‌తో పాటు మెగా టోర్నీలోనూ అతను ఆడనున్నాడు.

భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ టీ20 ప్రపంచకప్ ఫిబ్రవరి 7న ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో ఇంగ్లండ్ జట్టు గ్రూప్ దశలో వెస్టిండీస్, బంగ్లాదేశ్, నేపాల్, ఇటలీ జట్లతో తలపడనుంది.

ఇంగ్లండ్ ప్రొవిజనల్ జట్టు ఇదే:
హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్‌కీపర్), ఫిల్ సాల్ట్ (వికెట్‌కీపర్), బెన్ డకెట్, టామ్ బాంటన్, జాకబ్ బెతెల్, విల్ జాక్స్, జేమీ ఒవర్టన్, సామ్ కరన్, రెహాన్ అహ్మద్, లియామ్ డాసన్, అదిల్ రషీద్, జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్, ల్యూక్ వుడ్.
Harry Brook
England T20 World Cup
T20 World Cup 2026
Liam Livingstone
Jofra Archer
Josh Tongue
England Cricket
Cricket World Cup
Jos Buttler
Phil Salt

More Telugu News