India road network: ప్రపంచంలోనే రెండో అతిపెద్ద రోడ్ నెట్‌వర్క్‌గా భారత్

India 2nd largest road network globally
  • దేశంలో 1.46 లక్షల కిలోమీటర్లకు చేరిన జాతీయ రహదారులు
  • 2014తో పోలిస్తే ఎక్స్‌ప్రెస్ వేల నిర్మాణంలో భారీ వృద్ధి
  • ప్రమాద బాధితులకు దేశవ్యాప్తంగా ఉచిత వైద్య సాయం అమలు
  • క్షతగాత్రులను ఆదుకునే వారికి రూ.25 వేల రివార్డు పెంపు
గత 11 ఏళ్లలో భారతదేశం మౌలిక సదుపాయాల కల్పనలో, ముఖ్యంగా జాతీయ రహదారుల విస్తరణలో సరికొత్త చరిత్ర సృష్టించింది. దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల పొడవు 1,46,560 కిలోమీటర్లకు చేరడంతో, అమెరికా తర్వాత ప్రపంచంలోనే రెండో అతిపెద్ద రోడ్ నెట్‌వర్క్ కలిగిన దేశంగా భారత్ అవతరించింది. 2014లో 91,287 కిలోమీటర్లుగా ఉన్న జాతీయ రహదారులు, 2025 నాటికి ఏకంగా 61 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అగ్రరాజ్యం అమెరికా జాతీయ రహదారుల నెట్ వర్క్ విషయంలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది.

ముఖ్యంగా భారత్ మాల పరియోజన వంటి పథకాల ద్వారా భారత్ లో హైవేల రూపురేఖలు మారిపోయాయి. 2014లో కేవలం 93 కిలోమీటర్లుగా ఉన్న యాక్సెస్-కంట్రోల్డ్ హైస్పీడ్ కారిడార్లు, ఎక్స్‌ప్రెస్ వేలు ప్రస్తుతం 3,052 కిలోమీటర్లకు పెరిగాయి. అలాగే నాలుగు లేన్ల రహదారులు 18 వేల కిలోమీటర్ల నుంచి 43,512 కిలోమీటర్లకు రెట్టింపయ్యాయి. రాబోయే మూడేళ్లలో మరో రూ.8.3 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను చేపట్టేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.

సామాన్య ప్రజలకు ఊరటనిచ్చేలా భద్రతా ప్రమాణాల్లోనూ కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. రోడ్డు ప్రమాద బాధితులకు 'క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ స్కీమ్' ద్వారా రూ.1.5 లక్షల వరకు ఉచిత వైద్య సాయం అందించేలా చర్యలు తీసుకున్నారు. అలాగే ప్రమాద సమయంలో సాయం చేసే వారికి (గుడ్ సమారిటన్) ఇచ్చే పారితోషికాన్ని రూ.5 వేల నుంచి రూ.25 వేలకు పెంచారు. 

రవాణా రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు 2026 జనవరిలో పబ్లిక్ ఇన్విట్ (InvIT)ను తీసుకురానున్నట్లు అధికారులు తెలిపారు. హైడ్రోజన్ ట్రక్కుల ప్రయోగాలు, ఫాస్టాగ్ ఆధారిత టోలింగ్ వంటి ఆధునిక సాంకేతికతతో భారత రవాణా రంగం కొత్త పుంతలు తొక్కుతోంది.


India road network
Nitin Gadkari
national highways
highway expansion
Bharatmala Pariyojana
road infrastructure
expressways
road safety
cashless treatment scheme
transport investment

More Telugu News