Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పీసుమామిడి పేలుడు ఘటనపై జగన్ దిగ్భ్రాంతి.. సమగ్ర విచారణకు డిమాండ్

YS Jagan Mohan Reddy shocked over Pisumamidi explosion incident demands comprehensive inquiry
Advertisement
  • అల్లూరి జిల్లాలో రోడ్డు పనుల వద్ద భారీ పేలుడు
  • జిలెటిన్ స్టిక్స్ పేలి ఏడుగురి మృతి
  • అత్యంత బాధాకరమన్న జగన్
Advertisement
అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఈ ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అనంతగిరి మండలం పీసుమామిడి ఘాట్ రోడ్డులో నిర్మాణ పనుల్లో భాగంగా జిలెటిన్ స్టిక్స్ పేలడంతో ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో, విధి నిర్వహణకు వెళుతున్న ప్రభుత్వ ఉపాధ్యాయురాలు కూడా ఉండటం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో ఒక బొలెరో, ఒక టిప్పర్ వాహనాలు పూర్తిగా కాలిపోయాయి.

పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం... రోడ్డు విస్తరణ పనుల కోసం రాళ్లను పగలగొట్టేందుకు బొలెరో వాహనంలో జిలెటిన్ స్టిక్స్ ఉంచారు. సమీపంలో ఉన్న టిప్పర్‌కు డీజిల్ నింపుతుండగా ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుంది. ఈ మంటలు వేగంగా వ్యాపించి జిలెటిన్ స్టిక్స్ ఉన్న వాహనానికి అంటుకోవడంతో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో విశాఖపట్నం నుంచి మద్దిరేబు ఎంపీపీ పాఠశాలకు వెళుతున్న ఉపాధ్యాయురాలు సునీతతో పాటు కార్మికులు మణి, నారాయణరావు, పవన్ కుమార్ మరికొందరు ప్రాణాలు కోల్పోయారు.

ఈ దుర్ఘటనపై వైసీపీ అధినేత జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఈ దుర్ఘటనలో కార్మికులతో పాటు ప్రభుత్వ టీచర్ సునీత కూడా మృతి చెందడం అత్యంత బాధాకరం. ఉపాధి కోసం వచ్చిన కార్మికులు, విధి నిర్వహణలో ఉన్న ఉపాధ్యాయురాలు ఇలా ఆకస్మికంగా ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపించాలి. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తగిన ఆర్థిక పరిహారం అందించాలి" అని డిమాండ్ చేశారు.

ప్రమాదంపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత కూడా స్పందించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు అండగా నిలవాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Advertisement
Advertisement
YS Jagan Mohan Reddy
Pisumamidi Blast
Alluri Sitharama Raju District
Gelatin Sticks Explosion
Anantagiri Mandal
Andhra Pradesh News

More Telugu News