Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నామినేషన్లు వేయకుండా అభ్యర్థులను అడ్డుకున్నారంటూ వైసీపీ హైకోర్టులో పిటిషన్

YSRCP seeks 48 hour extension for ZPTC and MPTC nominations in AP High Court
Advertisement
  • నామినేషన్ల గడువు 48 గంటలు పెంచాలంటూ హైకోర్టులో వైసీపీ పిటిషన్
  • తమ అభ్యర్థులను అడ్డుకున్నారని, దాడులు జరిగాయని ఆరోపణ
  • తదుపరి విచారణ సోమవారానికి వాయిదా
Advertisement
ఆంధ్రప్రదేశ్‌లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల గడువును మరో 48 గంటలు పొడిగించాలని కోరుతూ వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ లంచ్ మోషన్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం, ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. పలుచోట్ల తమ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని, వారిపై దాడులు జరిగాయని పిటిషనర్ తరఫున న్యాయవాది వాదించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను కోర్టుకు సమర్పించినట్లు తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తమ అభ్యర్థులకు భద్రత కల్పించాలని కూడా కోరారు.

అయితే, వైసీపీ వాదనను రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ తోసిపుచ్చారు. వైసీపీ ఇప్పటికే ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి 12,500కు పైగా నామినేషన్లు దాఖలు చేసిందని, అక్కడక్కడా జరిగిన ఘటనలను రాష్ట్రవ్యాప్త సమస్యగా చిత్రీకరిస్తున్నారని ఆయన వాదించారు. అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు వస్తే వారికి భద్రత కల్పించాలని సర్క్యులర్లు జారీ చేశామని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ గడువు నిన్న ముగిసింది. ప్రస్తుతం నామినేషన్ల గడువు పొడిగింపుపై ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వని హైకోర్టు, సోమవారం దీనిపై తదుపరి విచారణ జరపనుంది.
Advertisement
Advertisement
YSRCP
Andhra Pradesh High Court
ZPTC MPTC Elections
Nomination Deadline Extension
Lella Appireddy
AP Local Body Elections

More Telugu News