గడ్డం పెంచితే కేటీఆర్ సీఎం అయిపోతాడా?: ధర్మపురి అర్వింద్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గడ్డం పెంచితే కేటీఆర్ సీఎం అయిపోతాడా?: ధర్మపురి అర్వింద్

Will KTR become CM by growing a beard asks Dharmapuri Arvind
  • 2028లో తెలంగాణలో కాషాయ సునామీ ఖాయమన్న ఎంపీ అర్వింద్
  • గడ్డం పెంచితే కేటీఆర్ ముఖ్యమంత్రి కాలేరంటూ వ్యంగ్యాస్త్రాలు
  • కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రహస్య పొత్తు చర్చలు జరుగుతున్నాయని ఆరోపణ
నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గడ్డం పెంచుకుంటే ముఖ్యమంత్రి అవుతారని ఎవరో చెప్పడం వల్లే కేటీఆర్ ఆ పని చేస్తున్నారని, అయితే ఆయన గడ్డం పెరుగుతుందే తప్ప సీఎం మాత్రం కాలేరని ఎద్దేవా చేశారు. 2028 ఎన్నికల్లో తెలంగాణలో కాషాయ సునామీ ఖాయమని, బీజేపీ ఒంటరిగానే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒకరినొకరు కాపాడుకుంటున్నాయని, ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కోసం తెరవెనుక చర్చలు జరుగుతున్నాయని సంచలన ఆరోపణలు చేశారు. ఈ పొత్తుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కరే అడ్డంకిగా ఉన్నారని, ఆయనపై కాంగ్రెస్ అధిష్ఠానం అసంతృప్తితో ఉందని అన్నారు. బీఆర్ఎస్‌తో కుమ్మక్కై రేవంత్‌ను సీఎం పదవి నుంచి తొలగించేందుకు అధిష్ఠానం ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు.

రాష్ట్రంలో బీజేపీ సైలెంట్‌గా ఉందన్న ప్రచారాన్ని ఆయన తోసిపుచ్చారు. రాజకీయ తుపాను సృష్టించేందుకు తెరవెనుక పనులు జరుగుతున్నాయని తెలిపారు. గతంలో కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా గడ్డం పెంచారని, ఆయన గడ్డం పెరిగింది కానీ కాంగ్రెస్ పార్టీ ఎదగలేకపోయిందని గుర్తుచేశారు. రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్‌కు ఓటు వేసే పరిస్థితి లేదని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండానే విజయం సాధిస్తుందని అర్వింద్ స్పష్టం చేశారు.
Advertisement
Dharmapuri Arvind
KTR
Telangana BJP
Telangana Politics
Revanth Reddy
BRS Congress Alliance

More Telugu News