పాలపిట్టలను బంధిస్తే కఠిన చర్యలు.. సీపీ సజ్జనార్‌ హెచ్చరిక
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పాలపిట్టలను బంధిస్తే కఠిన చర్యలు.. సీపీ సజ్జనార్‌ హెచ్చరిక

  • పాలపిట్టలను బంధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సజ్జనార్‌ హెచ్చరిక
  • దసరా వేళ పక్షులను బోనుల్లో బంధించి విక్రయించడంపై ఆగ్రహం
  • పాలపిట్ట తెలంగాణ రాష్ట్ర పక్షి అని గుర్తుచేసిన సీపీ
  • వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972 ప్రకారం బంధించడం, విక్రయించడం నేరం
  • పక్షుల ప్రదర్శనలను ప్రోత్సహించవద్దని ప్రజలకు విజ్ఞప్తి
పాలపిట్టలను బంధించినా, విక్రయించినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ హెచ్చరించారు. దసరా సందర్భంగా పాలపిట్టలను బోనుల్లో బంధించి విక్రయించే వారిపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. ఎక్కడైనా పక్షులను బంధించినట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్‌’ వేదికగా పోస్టు చేశారు.

పండుగ అంటే ఆనందం, స్వేచ్ఛతో పాటు తోటి ప్రాణుల పట్ల కరుణ చూపించడమని సజ్జనార్‌ పేర్కొన్నారు. అయితే, దసరా వేళ శుభం కలుగుతుందనే నమ్మకంతో కొందరు తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్ట రెక్కలు కత్తిరించి బోనుల్లో బంధించి వ్యాపారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మూగజీవాల స్వేచ్ఛను హరించి, వాటికి ఆహారం, నీరు అందకుండా హింసించడం వల్ల ఎవరికీ మేలు జరగదన్నారు. పక్షుల బాధలో శుభం ఎలా ఉంటుందని ప్రశ్నించారు.

పాలపిట్ట పర్యావరణానికి మేలు చేయడంతో పాటు రైతులకు ఉపయోగపడే పక్షి అని సజ్జనార్‌ తెలిపారు. నీలాకాశంలో స్వేచ్ఛగా ఎగురుతున్నప్పుడే ప్రకృతికి అందం చేకూరుతుందని పేర్కొన్నారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972 ప్రకారం పాలపిట్టలను బంధించడం, విక్రయించడం, ప్రదర్శించడం నేరమని స్పష్టం చేశారు. పండుగ సమయంలో పక్షులను బంధించి ప్రదర్శించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

పాలపిట్టలను బంధించినట్లు తెలిస్తే టోల్‌ఫ్రీ నంబర్లు 1800 4255364, 98033 38666 లేదా డయల్‌ 112కు సమాచారం అందించాలని సజ్జనార్‌ కోరారు. మూగజీవాలకు స్వేచ్ఛ కల్పిస్తూ బాధ్యతాయుతమైన పౌరులుగా వ్యవహరించాలని సూచించారు.
Advertisement

More Telugu News