చంపినా సరే.. డిసెంబరులో బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్తా: షేక్‌ హసీనా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చంపినా సరే.. డిసెంబరులో బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్తా: షేక్‌ హసీనా

Sheikh Hasina says she will face arrest and return to Bangladesh
  • అరెస్టు, హింస, ప్రాణహాని ఎదురైనా వెనక్కి తగ్గనని ప్రకటన
  • తిరుగు ప్రయాణానికి ఇంకా కచ్చితమైన తేదీ ఖరారు కాలేదని వెల్లడి
  • భారత్‌ ఆశ్రయం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపిన హసీనా
  • తనపై కేసుల్లో నిష్పక్షపాత విచారణ జరగాలని డిమాండ్‌
  • 2024 నిరసనలపై తలెత్తిన ప్రశ్నలను ప్రస్తావించిన మాజీ ప్రధాని
బంగ్లాదేశ్‌ రాజకీయాల్లో మరో కీలక పరిణామానికి సంకేతాలు కనిపిస్తున్నాయి. మాజీ ప్రధాని షేక్‌ హసీనా డిసెంబరులో స్వదేశానికి తిరిగి వెళ్తానని ప్రకటించారు. తనను అరెస్టు చేసినా, హింసించినా, ప్రాణాలు తీసినా వెనక్కి తగ్గబోనని స్పష్టం చేశారు. అయితే తిరుగు ప్రయాణానికి కచ్చితమైన తేదీని వెల్లడించలేదు.

వాషింగ్టన్‌ కేంద్రంగా జరిగిన మీడియా సమావేశంలో ఆమె వర్చువల్‌గా పాల్గొన్నారు. తన మద్దతుదారులకు అండగా నిలవడం రాజకీయ బాధ్యతగా భావిస్తున్నానని చెప్పారు. స్వదేశానికి వెళ్లడం ప్రమాదకరమని తెలిసినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. ఆమె కుమారుడు సజీబ్‌ వాజెద్‌ జాయ్‌ స్పందిస్తూ.. తిరుగు ప్రయాణానికి ఇంకా తేదీ ఖరారు కాలేదని, సమయం దగ్గరపడినప్పుడు ప్రకటిస్తామని తెలిపారు.

2024 ఆగస్టులో ప్రభుత్వం కూలిపోవడంతో బంగ్లాదేశ్‌ను వీడిన హసీనా అప్పటి నుంచి భారత్‌లో ఉంటున్నారు. తనకు ఆశ్రయం కల్పించిన భారత ప్రభుత్వం, ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. 1975లో తన కుటుంబ సభ్యులు హత్యకు గురైన సమయంలో ఎదురైన పరిస్థితులను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.

తండ్రి షేక్‌ ముజిబుర్‌ రెహమాన్‌ హత్య సమయంలో విదేశాల్లో ఉన్న హసీనా తిరిగి 1981లో బంగ్లాదేశ్‌కు వచ్చారు. 2007లో రాజకీయ సంక్షోభం, క్రిమినల్‌ ఆరోపణలు ఎదురైన సమయంలోనూ స్వదేశానికి తిరిగొచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. గతంలోనూ భద్రతాపరమైన ముప్పులను లెక్కచేయకుండా నిర్ణయాలు తీసుకున్నానని గుర్తుచేశారు.

తనపైనా, అవామీ లీగ్‌ నేతలపైనా నమోదైన కేసులను రాజకీయ ప్రత్యర్థులను అణచివేసేందుకు ఉపయోగిస్తున్నారని హసీనా ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలపై స్వతంత్ర న్యాయపరమైన విచారణ జరగాలని కోరారు. 2024 నిరసనలు, తన ప్రభుత్వ హయాంలో జరిగిన పరిణామాలపై తలెత్తిన ప్రశ్నలను కూడా ప్రస్తావించారు. తనతో పాటు ఎవరిపై వచ్చిన ఆరోపణలనైనా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా విచారించాలని అన్నారు.

బంగ్లాదేశ్‌ భవిష్యత్తును ప్రజలే స్వేచ్ఛాయుత, సమ్మిళిత ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారా నిర్ణయించాలని హసీనా పేర్కొన్నారు. న్యాయవ్యవస్థ స్వతంత్రత, భావప్రకటనా స్వేచ్ఛ, మైనారిటీల రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. రాజకీయ ప్రతీకారానికి బదులుగా సయోధ్యతోనే దేశ భవిష్యత్తును నిర్మించాలని పిలుపునిచ్చారు.
Advertisement
Sheikh Hasina
Bangladesh politics
Awami League
Sajeeb Wazed Joy
Bangladesh news update
India Bangladesh relations

More Telugu News