స్థానిక సంస్థల్లోనూ కూటమికి జై కొట్టండి: సీఎం చంద్రబాబు పిలుపు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

స్థానిక సంస్థల్లోనూ కూటమికి జై కొట్టండి: సీఎం చంద్రబాబు పిలుపు

Chandrababu Naidu calls for NDA victory in local body elections
  • ట్రిపుల్ ఇంజన్ సర్కారుతో అభివృద్ధి మూడు రెట్ల వేగంతో సాగుతుందని హామీ
  • అభ్యర్థుల ఎంపికలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 63.6 శాతం స్థానాలు కేటాయింపు
  • విద్యావంతులకు, విధ్వంసకారులకు మధ్య జరుగుతున్న పోరు ఈ ఎన్నికలు
  • గత ప్రభుత్వ హయాంలోని అరాచకాలపై వీడియోలను ప్రదర్శించిన ముఖ్యమంత్రి
సార్వత్రిక ఎన్నికల మాదిరిగానే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఎన్డీఏ కూటమికి పట్టం కడితే, కేంద్రం, రాష్ట్రం, స్థానిక ప్రభుత్వాల కలయికతో 'ట్రిపుల్ ఇంజన్' వేగంతో అభివృద్ధి పరుగులు పెడుతుందని ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ప్రజాస్వామ్య పునాదులను మరింత పటిష్ఠం చేసేలా ఈ ఎన్నికల ఫలితాలు ఉండాలని ఆకాంక్షించారు. సోమవారం అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక ఎన్నికలతో క్షేత్రస్థాయిలో నాయకత్వం బలపడుతుందని, అందుకే సమర్థవంతమైన నాయకత్వాన్ని ప్రజలకు అందించాలనే లక్ష్యంతో అభ్యర్థుల ఎంపికలో ఎన్నడూ లేనంత కసరత్తు చేస్తున్నామని వివరించారు.

పట్టణ స్థానిక ఎన్నికల్లో మాదిరిగానే గ్రామీణ ఎన్నికల్లోనూ ఇదే స్థాయిలో కసరత్తు చేస్తామన్నారు. 'ఆయారాం గయారాం' సంస్కృతికి స్వస్తి పలుకుతూ, మేయర్లు, మున్సిపల్ ఛైర్‌పర్సన్లను ప్రజలే నేరుగా ఎన్నుకునే విధానాన్ని తీసుకొచ్చామని తెలిపారు. అభ్యర్థుల ఎంపికలో ప్రజాభీష్టానికి ప్రాధాన్యతనిస్తూ, సామాజిక పునరేకీకరణ (సోషల్ రీ-ఇంజనీరింగ్) చేపట్టామని చెప్పారు. ఇందులో భాగంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు 63.6 శాతం స్థానాలు కేటాయించామని, ఒక్క బీసీలకే 35 శాతానికి పైగా సీట్లు ఇచ్చి పెద్దపీట వేశామని వెల్లడించారు. విద్యావంతులు, యువత, మహిళలు, పార్టీకి సేవలందించిన వారికే టికెట్లు ఇచ్చామని, ప్రతి మేయర్ స్థానాన్ని ఒక్కో సామాజిక వర్గానికి కేటాయించామని చంద్రబాబు పేర్కొన్నారు.

చెప్పాం.. చేస్తున్నాం..

2024 సార్వత్రిక ఎన్నికల్లో 94 శాతం స్ట్రైక్ రేట్, 57 శాతం ఓట్ షేర్‌తో ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారని గుర్తుచేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, పవన్ కళ్యాణ్‌తో కలిసి ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తూ సంక్షేమ పాలన అందిస్తున్నామని తెలిపారు. దేశంలోనే అత్యధికంగా సామాజిక భద్రత పింఛన్లు అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ అని, ఇది అతిపెద్ద నగదు బదిలీ కార్యక్రమమని కొనియాడారు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 'తల్లికి వందనం' పథకాన్ని అమలు చేస్తున్నామని, అన్నదాత సుఖీభవ, స్త్రీశక్తి, దీపం-2.0 వంటి పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామన్నారు. 

విశాఖ, విజయవాడల్లో సంపూర్ణ హక్కులతో ఇళ్ల పట్టాలు, 'రాజముద్ర'తో పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నామని వివరించారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, డేటా సెంటర్ల నుంచి డిఫెన్స్ ప్రాజెక్టుల వరకు భారీ పెట్టుబడులను ఆకర్షిస్తూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. 2029 నాటికి 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని, గోదావరి-కావేరి అనుసంధానంతో దక్షిణాది రాష్ట్రాల నీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

విద్యావంతులకు, గంజాయి బ్యాచ్‌కు మధ్య పోటీ

ఈ స్థానిక ఎన్నికలు విద్యావంతులకు, గంజాయి బ్యాచ్‌కు మధ్య జరుగుతున్న పోటీ అని చంద్రబాబు అభివర్ణించారు. అభివృద్ధి, సంక్షేమమే ఎన్డీఏ అజెండా అయితే, హింసను ప్రేరేపించడమే 'గొడ్డలి పార్టీ' విధానమని విమర్శించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘోరంగా ఓడినా ఆ పార్టీకి బుద్ధి రాలేదని, స్థానిక ఎన్నికల్లోనూ విధ్వంసానికే ప్రాధాన్యత ఇస్తోందని మండిపడ్డారు. 

గొడ్డలి పార్టీ అధ్యక్షుడు తన అవినీతి, అక్రమాల నుంచి రక్షణ పొందేందుకే 'జెన్-జీ' అంటున్నారని, వారిని పావులుగా వాడుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. "గొడ్డలి పార్టీ చేసిన అకృత్యాల నుంచి జెన్-జీ కాపాడాలా?" అని ప్రశ్నించారు.

గత ప్రభుత్వ హయాంలో నాటి అక్రమాలను ప్రశ్నించిన ఎస్ఈసీపైనే ఎదురుదాడి చేసి, ఆయన ప్రాణరక్షణ కోసం కేంద్రాన్ని ఆశ్రయించే దుస్థితి కల్పించారని గుర్తుచేశారు. గత ప్రభుత్వంలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌తో భూములను దోపిడీ చేయాలని చూశారని, ప్రజల ఆస్తులపై నాటి సీఎం తన బొమ్మలు వేసుకున్నారని విమర్శించారు. దేవాలయాలను అపవిత్రం చేసి, కల్తీ ప్రసాదాలు తయారు చేయించారని, ప్రస్తుతం తాము పవిత్ర వాతావరణాన్ని నెలకొల్పుతున్నామని చెప్పారు.

Advertisement
Chandrababu Naidu
AP Local Body Elections
NDA Alliance Andhra Pradesh
Triple Engine Growth
Social Engineering Candidates
Andhra Pradesh Welfare Schemes

More Telugu News