దావూద్ ఇబ్రహీం ఎక్కడో ఉండి నేరసామ్రాజ్యం నడిపిస్తుంటాడు.. ఇతడు కూడా అంతే!: సీఎం చంద్రబాబు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దావూద్ ఇబ్రహీం ఎక్కడో ఉండి నేరసామ్రాజ్యం నడిపిస్తుంటాడు.. ఇతడు కూడా అంతే!: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu compares opposition leader to Dawood Ibrahim for running crime empire
  • దావూద్ ఇబ్రహీంలా బెంగళూరు నుంచి అరాచకాలు నడిపిస్తున్నారని ఆరోపణ
  • గత స్థానిక ఎన్నికల్లో బలవంతపు ఏకగ్రీవాలు, దౌర్జన్యాలపై తీవ్ర విమర్శలు
  • హింసా రాజకీయాలతో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుందని ఆవేదన
  • నేరస్థులపై కఠిన చర్యలు తప్పవని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పిలుపు
ఎక్కడున్నాడో తెలియకుండా దావూద్ ఇబ్రహీం తన మాఫియా సామ్రాజ్యాన్ని నడిపిస్తుంటాడని, ప్రస్తుతం గొడ్డలి పార్టీ అధ్యక్షుడు కూడా అదే తరహాలో బెంగళూరులో ఉంటూ రాష్ట్రంలో అరాచకాలు సృష్టిస్తున్నాడని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుంటే, గొడ్డలి పార్టీ మాత్రం ఇప్పటికీ వినాశనానికే పనిచేస్తోందని ఆయన విరుచుకుపడ్డారు. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. కొలంబియాకు చెందిన డ్రగ్ లార్డ్ పాబ్లో ఎస్కోబార్ మనస్తత్వం, గొడ్డలి పార్టీ అధ్యక్షుడి మనస్తత్వం ఒకటేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

గత ప్రభుత్వ హయాంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు, ప్రస్తుత ఎన్నికల్లోనూ గొడ్డలి పార్టీ అరాచకాలకు పాల్పడుతోందని అన్నారు. ఈ మేరకు కొన్ని వీడియోలను సీఎం మీడియాకు ప్రదర్శించారు. గొడ్డలి పార్టీ నేరస్థులను తయారు చేసే ఫ్యాక్టరీలా మారిపోయిందని, హింస ఆ పార్టీ డీఎన్ఏలోనే ఉందని ధ్వజమెత్తారు. 

"గత ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉన్న పార్టీలను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారు. పులివెందులలో కనీసం నామినేషన్ వేయనీయని పరిస్థితి కల్పించారు. కానీ నేడు కుప్పం, పిఠాపురం, పులివెందులలో కూడా వైసీపీ సహా అన్ని పార్టీలు స్వేచ్ఛగా నామినేషన్లు వేశాయి. ఇదే ప్రజాస్వామ్యానికి, నియంతృత్వానికి ఉన్న తేడా" అని చంద్రబాబు వివరించారు.

గతంలో అధికార దుర్వినియోగంతో స్థానిక ఎన్నికల్లో అడ్డగోలుగా ఏకగ్రీవాలు చేయించుకున్నారని సీఎం ఆరోపించారు. వారి హయాంలో 24 శాతం ఎంపీటీసీ, 19 శాతం జెడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయని, అదే 2014లో తమ ప్రభుత్వ హయాంలో ఎంపీటీసీ ఏకగ్రీవాలు 2 శాతం, జెడ్పీటీసీలు కేవలం 0.09 శాతంగానే ఉన్నాయని గణాంకాలతో సహా వివరించారు. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థుల ఇళ్లల్లో దొంగతనంగా మద్యం బాటిళ్లు పెట్టించి, వారిని అనర్హులుగా ప్రకటించేందుకు ప్రత్యేక చట్టం కూడా తెచ్చారని గుర్తుచేశారు.

హింస ఏ రూపంలో ఉన్నా అభివృద్ధికి ఆటంకమని చంద్రబాబు అన్నారు. "ఫ్యాక్షనిజం కారణంగా రాయలసీమ 70 ఏళ్లు నష్టపోయింది. నక్సలిజం వల్ల ఎందరో మంచి నాయకులను కోల్పోయాం. నాడు నక్సలిజం వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని మేం పిలుపునిస్తే, సీతక్క వంటి వారు రాజకీయాల్లోకి వచ్చారు. హింసను నా జీవితంలో ఎప్పుడూ ప్రోత్సహించలేదు.. నా జీవితంలోనూ హింస లేదు.. కానీ నేరస్థులను, రౌడీలను చూసి పారిపోను. వారిని అణచివేస్తే కక్ష పెట్టుకుంటారని తెలుసు, కానీ ఆ బెదిరింపులకు భయపడను" అని స్పష్టం చేశారు. వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేసి ఆ నెపాన్ని తనపై నెట్టారని, ఇప్పుడు కూడా గొడ్డలి పార్టీ చేస్తున్న హింసకు తనను బాధ్యుణ్ణి చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.

రాబోయే 20 ఏళ్లు రాష్ట్ర భవిష్యత్తుకు అత్యంత కీలకమని, అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడిగా ప్రజలకు వాస్తవాలు వివరించడం తన బాధ్యత అని చంద్రబాబు తెలిపారు. ప్రజాస్వామ్య పునాదులను పటిష్టం చేసేందుకు, హింసను అరికట్టేందుకు కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Advertisement
Chandrababu Naidu
Dawood Ibrahim
Andhra Pradesh Politics
YSRCP
Election Violence
Pablo Escobar

More Telugu News