Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అనిరుధ్-కావ్య మారన్ పెళ్లి ఖరారు.. ఈ జంట ఆస్తులు ఎంతో తెలుసా?

Anirudh Kavya Maran wedding confirmed check out this couples net worth
Advertisement
  • పెళ్లి చేసుకోబోతున్న‌ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ 
  • నవంబర్ 11న గ్రీస్‌లో పెళ్లి..! 21న చెన్నైలో రిసెప్షన్ 
  • చెన్నై రిసెప్షన్‌కు తనను ఆహ్వానించారని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి
  • ఇరువురి ఉమ్మడి ఆస్తుల విలువ రూ.500 కోట్లకు పైగా ఉంటుందని అంచనా
Advertisement
సౌత్ ఇండియా సినీ, వ్యాపార వర్గాల్లో ఎంతో ఆసక్తి రేపుతున్న ఓ వార్త ఇప్పుడు ఖరారైంది. ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్ గ్రూప్ ఛైర్మన్ కళానిధి మారన్ కుమార్తె, సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్ త్వరలో వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారు. గత కొంతకాలంగా వీరి పెళ్లిపై ఊహాగానాలు వినిపిస్తుండగా, తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ జంట రిసెప్షన్‌కు ఆహ్వానం అంద‌డంతో ఈ వార్త నిజ‌మ‌యింది.

మీడియా కథనాల ప్రకారం.. వీరి వివాహం నవంబర్ 11న గ్రీస్‌లో అత్యంత సన్నిహితుల మధ్య జరగనుంది. అనంతరం నవంబర్ 21న చెన్నైలో సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖుల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. ఈ రిసెప్షన్‌కు కావ్య తల్లిదండ్రులు తనను స్వయంగా ఆహ్వానించారని సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా వెల్లడించారు. దీంతో వీరి పెళ్లి వార్త నిజమేనని స్పష్టమైంది. అయితే, పెళ్లి తేదీలు, వేదికల వంటి పూర్తి వివరాలపై అనిరుధ్ లేదా కావ్యల నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ప్రముఖుల వారసులుగా..
కావ్య మారన్ కేవలం సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ కుమార్తెగానే కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ, సహ యజమానిగా జట్టు వ్యవహారాలను ముందుండి నడిపిస్తున్నారు. ఐపీఎల్ వేలంలో, మ్యాచ్‌ల సమయంలో ఆమె హావభావాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఆమె సన్ టీవీ నెట్‌వర్క్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కూడా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

మరోవైపు అనిరుధ్ రవిచందర్ తన సంగీతంతో దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. 'వై దిస్ కొలవెరి డి' పాటతో సంచలనం సృష్టించిన ఆయన, తమిళంతో పాటు తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమలలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎదిగారు. ఇటీవల వీరిద్దరూ కలిసి 'జైలర్ 2' సినిమా స్క్రీనింగ్‌లో కనిపించడంతో వీరి మధ్య ఉన్న బంధంపై చర్చ మొదలైంది.

రూ.500 కోట్లకు పైగా ఆస్తులు..
ఈ కాబోయే దంపతుల ఆస్తుల విలువ కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మీడియా అంచనాల ప్రకారం, సంగీత దర్శకుడిగా సినిమాలు, లైవ్ షోల ద్వారా అనిరుధ్ నికర ఆస్తుల విలువ సుమారు రూ.50 నుంచి రూ.60 కోట్ల వరకు ఉంటుంది. ఇక కావ్య మారన్ వ్యక్తిగత ఆస్తుల విలువ దాదాపు రూ.400 నుంచి రూ.500 కోట్ల మధ్య ఉంటుందని అంచనా. 

కుటుంబ వ్యాపారాల్లో వాటాలు, సన్‌రైజర్స్ హైదరాబాద్ ద్వారా ఆమెకు ఈ స్థాయి ఆస్తులు ఉన్నాయి. మొత్తంగా వీరిద్దరి ఉమ్మడి సంపద రూ.450 కోట్ల నుంచి రూ.550 కోట్ల మధ్య ఉంటుందని భావిస్తున్నారు. ఏదేమైనా వినోదం, వ్యాపార రంగాలకు చెందిన ఈ పవర్ కపుల్ పెళ్లి ప్రకటన కోసం అభిమానులు, పరిశ్రమ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
Advertisement
Advertisement
Anirudh Ravichander
Kavya Maran
Anirudh Kavya Maran wedding
Sunrisers Hyderabad CEO
Kalanithi Maran daughter
Anirudh Ravichander net worth

More Telugu News