పుంగనూరు ఘర్షణలపై ఎస్పీ ధీరజ్ ప్రెస్ మీట్.. వివరాలు ఇవిగో!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పుంగనూరు ఘర్షణలపై ఎస్పీ ధీరజ్ ప్రెస్ మీట్.. వివరాలు ఇవిగో!

SP Dheeraj press meet on Punganur clashes details here
  • పుంగనూరు నామినేషన్ల ప్రక్రియలో తీవ్ర ఉద్రిక్తత
  • వైసీపీ వర్సెస్ టీడీపీ
  • గేట్లు, బారికేడ్లను ఢీకొట్టి లోపలికి ప్రవేశించిన వాహనాలు
  • అతివేగంగా వచ్చిన వాహనం ఢీకొని పలువురికి గాయాలు
  • చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలన్న అన్నమయ్య జిల్లా ఎస్పీ
పుంగనూరులో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతల మధ్య ప్రారంభమైంది. వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తన అనుచరులతో కలిసి నామినేషన్ కేంద్రానికి రావడం ఘర్షణకు దారితీయడం తెలిసిందే. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి వైసీపీ శ్రేణులు వ్యవహరించాయని, ఈ క్రమంలో జరిగిన ఘర్షణలో పలువురు గాయపడ్డారని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ తెలిపారు. దీనిపై ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. జరిగిన ఘటనను వివరించారు.

ఎస్పీ ప్రెస్ మీట్ వివరాలు..

"పుంగనూరు మున్సిపాలిటీలో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియలో ఈరోజు నామినేషన్లు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో వైసీపీకి చెందిన ఎంపీ మిథున్ రెడ్డి, ఆయన అనుచరులు, అభ్యర్థులు సుమారు 100 మంది తమ నివాసం నుంచి ఆరు వాహనాల్లో నామినేషన్ కేంద్రానికి బయలుదేరారు.

ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం, నామినేషన్ కేంద్రానికి 100 మీటర్ల పరిధిలోకి అభ్యర్థి, మరో ఇద్దరు మాత్రమే రావాలి. కానీ, దాన్ని ఉల్లంఘించి, వాహనాలతో అతివేగంగా అక్కడ ఉన్న స్టాపర్లను, గేటును ఢీకొట్టుకుని లోపలికి వచ్చారు. 

దీన్ని అక్కడ ఉన్న టీడీపీ అభ్యర్థులు, కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకించడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. వెంటనే మా పోలీస్ సిబ్బంది జోక్యం చేసుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. అదే సమయంలో, ఒక వాహనం నామినేషన్ కేంద్రంలోకి అతివేగంగా, అజాగ్రత్తగా దూసుకువచ్చి అక్కడి జనం మీదకు వెళ్ళింది. ఈ ఘటనలో కొందరికి గాయాలయ్యాయి. వారిని వెంటనే అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించాం. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు మా బలగాలన్నింటినీ అక్కడికి తరలించి, గుంపును చెదరగొట్టాం. ఎంపీ గారిని ఒక గదిలో ఉంచాం. బయట గుంపు మొత్తం చెదిరిపోయిన తర్వాత, ఎంపీని సురక్షిత ప్రాంతానికి పంపించాం.

ఈ సంఘటనలో ఎవరైతే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవాలని ప్రయత్నించారో, వారిని కఠినంగా శిక్షిస్తామని మా పోలీసు శాఖ తరఫున తెలియజేస్తున్నాను. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలి. ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నాం" అని ఎస్పీ స్పష్టం చేశారు.

మరోవైపు, ఈ ఘటనపై రాష్ట్ర మంత్రి డీఎస్‌బీవీ స్వామి కూడా తీవ్రంగా స్పందించారు. వైసీపీ శ్రేణుల తీరును ఖండిస్తున్నామని అన్నారు. పుంగనూరులో రౌడీయిజం చేస్తే చూస్తూ ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు. 

ఈ సంఘటనతో పుంగనూరులో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.


Advertisement
SP Dheeraj
Mithun Reddy
Punganur clashes
Andhra Pradesh local body elections
YSRCP TDP clash
Annamayya district police

More Telugu News