అల్పాహార పథకం సూపర్ హిట్.. బడుల్లో 22 శాతం పెరిగిన హాజరు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అల్పాహార పథకం సూపర్ హిట్.. బడుల్లో 22 శాతం పెరిగిన హాజరు!

Revanth Reddy Breakfast Scheme is a super hit as school attendance increases by 22 percent
  • తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకంపై సర్వేలో సత్ఫలితాలు
  • పాఠశాలల్లో 20 నుంచి 22 శాతం వరకు పెరిగిన విద్యార్థుల హాజరు
  • సర్వేలో 99.9 శాతం మంది విద్యార్థులు టిఫిన్ తింటున్నారని వెల్లడి
  • మెనూలో బోండా, దోశకు అధిక ఆదరణ.. ఉప్మాకు తక్కువ స్పందన
  • రాష్ట్రవ్యాప్తంగా పథకాన్ని విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయం
ప్రభుత్వ పాఠశాలల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మానస పుత్రికగా ప్రారంభమైన అల్పాహార పథకం అద్భుతమైన ఫలితాలనిస్తోంది. ఈ పథకం వల్ల విద్యార్థుల హాజరు శాతం గణనీయంగా పెరగడమే కాకుండా, వారిలో ఆరోగ్యపరమైన మార్పులు కూడా కనిపిస్తున్నాయని ఓ స్వతంత్ర సర్వే స్పష్టం చేసింది. కొడంగల్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైన ఈ పథకంపై ‘థర్డ్ విజన్ రీసెర్చ్ అండ్ సర్వీసెస్’ సంస్థ ఈ సర్వేను నిర్వహించింది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు హరే కృష్ణ మూమెంట్ (హెచ్‌కేఎం) చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొడంగల్‌లోని సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా ఈ పథకం అమలవుతోంది. కొడంగల్‌తో పాటు కోస్గీ, బొంరాసిపేట, దోమ, తాండూరు సహా పది మండలాల్లోని పాఠశాలల్లో 1,153 మంది విద్యార్థులు, 575 మంది తల్లిదండ్రులు, 176 మంది ఉపాధ్యాయుల నుంచి అభిప్రాయాలు సేకరించి ఈ నివేదికను రూపొందించారు.

సర్వేలో తేలింది ఇదే..
నివేదిక ప్రకారం, ఈ పథకం ప్రారంభమయ్యాక 60 పాఠశాలల్లో ఏకంగా 1,525 మంది విద్యార్థులు కొత్తగా చేరారు. పాఠశాలల్లో అందిస్తున్న అల్పాహారాన్ని 99.9 శాతం విద్యార్థులు తింటుండగా, ఆకలితో అలమటించే వారి సంఖ్య 98.3 శాతం మేర తగ్గినట్లు తేలింది. గత విద్యా సంవత్సరంతో పోలిస్తే హాజరు శాతం సగటున 20 నుంచి 22 శాతం పెరిగింది. ఉపాధ్యాయులు సైతం పథకం నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. 97.7 శాతం మంది సమయానికి అల్పాహారం అందుతోందని తెలిపారు.

రుచి, నాణ్యతపై సానుకూల స్పందన
విద్యార్థుల్లో 92.7 శాతం మంది నాణ్యత బాగుందని చెప్పగా, 91.3 శాతం మంది రుచి బాగుందని కితాబిచ్చారు. మెనూలో బోండా-చట్నీ, దోశ-చట్నీలకు 95 శాతం పైగా విద్యార్థులు ఓటేశారు. అయితే, ఉప్మా-చట్నీకి కేవలం 75 శాతం మాత్రమే సానుకూల స్పందన లభించింది. మెనూలో వడను కూడా చేర్చాలని 29.2 శాతం మంది విద్యార్థులు కోరారు. నాణ్యతను మరింత మెరుగుపరచాలని కొందరు ఉపాధ్యాయులు సూచించారు.

కొడంగల్‌లో విజయవంతమైన ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. డిసెంబరు 9న అన్ని కిచెన్‌లను ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఉదయం పూట ఆకలితో తరగతులకు వచ్చే అవస్థను తప్పించి, చదువుపై ఏకాగ్రత పెంచే ఈ పథకం విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తుందని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
Revanth Reddy
Telangana Breakfast Scheme
Kodangal School Survey
School Attendance Increase
Hare Krishna Movement Foundation
Government School Education

More Telugu News