చంద్రబాబుతో భేటీ అయిన తమిళనాడు సీఎం విజయ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చంద్రబాబుతో భేటీ అయిన తమిళనాడు సీఎం విజయ్

Tamil Nadu CM Vijay meets Chandrababu
  • సీఎం హోదాలో ఏపీకి తొలిసారి వచ్చిన తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్
  • తెలుగు గంగ, గోదావరి-కావేరి అనుసంధానంపై ఏపీ, తమిళనాడు సీఎంల చర్చలు
  • భేటీకి ముందు కనకదుర్గమ్మను దర్శించుకున్న సీఎం విజయ్
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల మధ్య కీలకమైన అంతర్రాష్ట్ర జల పంపకాలపై చర్చించేందుకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విజయ్ అధికారికంగా ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించడం ఇదే తొలిసారి.

ఈ సమావేశంలో చెన్నై నగరానికి తాగునీరు అందించే తెలుగు గంగ ప్రాజెక్టు కింద కృష్ణా జలాల విడుదల, ప్రతిపాదిత గోదావరి-కృష్ణ-కావేరి నదుల అనుసంధానం వంటి అంశాలపై ఇరువురు నేతలు ప్రధానంగా దృష్టి సారించనున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది తమిళనాడుకు కేటాయించిన నీటిలో చాలా తక్కువ వాటా మాత్రమే అందడంతో, నీటి విడుదలపై చర్చించేందుకు ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది.

ఈ సమావేశంలో ఏపీ తరఫున మంత్రులు పొంగూరు నారాయణ, నిమ్మల రామానాయుడు, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు. వారిని ముఖ్యమంత్రి చంద్రబాబు తమిళనాడు సీఎం విజయ్‌కు పరిచయం చేశారు.

అంతకుముందు, గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సీఎం విజయ్, నేరుగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. రాత్రికి జరగనున్న విజయవాడ ఉత్సవ్ 2.0 వేడుకల్లో పాల్గొని, అనంతరం ఆయన చెన్నైకి తిరిగి వెళ్లనున్నారు.
.
Advertisement
Joseph Vijay
Chandrababu Naidu
Telugu Ganga Project
Interstate Water Sharing
Godavari Krishna Cauvery Linking
Vijayawada Utsav

More Telugu News