Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

‘నిద్రపోవద్దు.. మాకు మీరు కావాలి’.. పైలట్‌ స్మిత్‌ను ఎలా కాపాడారంటే..!

Dont sleep we need you How Pilot Smith Macher was saved
Advertisement
  • స్మిత్‌ను 45 నిమిషాలు కాపాడిన డెంటిస్ట్‌
  • టీషర్ట్‌లు, ఐస్‌తో రక్తస్రావం నియంత్రణ
  • ప్రమాదకరంగా పడిపోయిన పైలట్‌ పల్స్‌
  • స్పృహలో ఉంచేందుకు కుటుంబం గురించి మాటలు
  • మందులు ఇవ్వకుండా గాయాలు కదలకుండా జాగ్రత్త
Advertisement
విమానంలో దాడికి గురై తీవ్రంగా గాయపడిన భారత పైలట్‌ స్మిత్‌ మచ్ఛర్‌ను కాపాడేందుకు ఓ డెంటిస్ట్‌ తీవ్రంగా శ్రమించినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. 45 నిమిషాల పాటు స్మిత్‌ ప్రాణాలతో పోరాడినట్లు తెలుస్తోంది. ‘‘నిద్రపోవద్దు.. మాకు మీరు కావాలి’’ అంటూ పైలట్‌ను ధైర్యంగా ఉంచేందుకు ప్రయత్నించారు. గాయాలతో రక్తస్రావం అవుతున్న స్మిత్‌కు విమానంలోనే ప్రాథమిక చికిత్స అందించారు.

సెప్టెంబర్‌ 30న టెల్‌ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్‌ విమానంలో కోపైలట్‌ హమామ్‌ అల్‌ హమ్మామీ దాడికి పాల్పడిదన విషయం తెలిసిందే. ఈ ఘటనలో స్మిత్‌ తల, మెడ, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. దాడి అనంతరం ఆయన కాక్‌పిట్‌లో నేలపై పడిపోయారు.

టీషర్ట్‌లతో కట్టుకట్టి..

విమానంలో ఉన్న జార్జియా దేశానికి చెందిన డెంటిస్ట్‌ డాక్టర్‌ షుటా ముసావ్‌ వెంటనే స్మిత్‌ వద్దకు వెళ్లారు. ఆయనే విమానంలో ఉన్న ఏకైక వైద్యుడు. స్మిత్‌ తల, ఎడమ చేతి నుంచి తీవ్రంగా రక్తం కారుతుండటంతో టీషర్ట్‌లను ఉపయోగించి గాయాలపై కవర్‌ చేశారు. రక్తస్రావం తగ్గకపోవడంతో సిబ్బంది నుంచి ఐస్‌ ప్యాకెట్లు తెప్పించారు.

ప్రతిసారీ గాయాన్ని పరిశీలించేందుకు కట్టు తొలగిస్తే రక్తస్రావం మళ్లీ పెరిగేదని ముసావ్‌ తెలిపారు. దీంతో 45 నిమిషాల పాటు అలాగే ఉంచారు. స్మిత్‌ పల్స్‌ ఓ దశలో ప్రమాదకర స్థాయికి పడిపోయింది. వెంటనే కాళ్లు పైకి ఎత్తడంతో పల్స్‌ తిరిగి సాధారణ స్థాయికి వచ్చింది.

‘మీవాళ్ల దగ్గరకు వెళ్తారు’
స్మిత్‌ స్పృహ కోల్పోకుండా ఉండేలా ముసావ్‌ ఆయనతో మాట్లాడుతూనే ఉన్నారు. కుటుంబం, పిల్లల గురించి అడిగారు. ‘‘భయపడకండి.. మీరు మీ ఫ్యామిలీ దగ్గరకు వెళ్తారు. విమానం త్వరలో ల్యాండ్‌ అవుతుంది’’ అంటూ ధైర్యం చెప్పారు.

ఓ దశలో స్మిత్‌ ‘‘నన్ను కాపాడండి.. ఇక్కడ చనిపోవాలని లేదు’’ అంటూ వేడుకున్నారని ముసావ్‌ తెలిపారు. ఆయన పెదాలు నీలంగా మారడంతో విమాన సిబ్బందిని త్వరగా ల్యాండింగ్‌ చేయాలని కోరారు.

స్మిత్‌కు నొప్పి నివారణ మందులు ఇవ్వాలని కొందరు సూచించినా ముసావ్‌ అంగీకరించలేదు. గాయాలు మరింత తీవ్రం కావొచ్చని భావించి కదిలించకుండా ఉంచారు. కొద్దికొద్దిగా నీరు ఇచ్చారు. ఆయన మాట్లాడుతున్నారా? స్పృహలో ఉన్నారా? పల్స్‌ ఎలా ఉంది? పెదాల రంగు ఎలా ఉందన్న అంశాలను గమనిస్తూ ఉన్నారు.

‘స్మిత్‌ మా ప్రాణాలు కాపాడారు’
విమానం సౌదీ అరేబియాలో ల్యాండ్‌ అయిన తర్వాత స్మిత్‌ను వైద్యులకు అప్పగించారు. ‘‘గుడ్‌లక్‌ మై ఫ్రెండ్‌.. అంతా బాగుంటుంది’’ అంటూ ముసావ్‌ వీడ్కోలు చెప్పారు.

ఈ ఘటన తర్వాత ముసావ్‌, ఆయన భార్య మానసిక ఒత్తిడికి గురయ్యారు. అయినా స్మిత్‌ తమ ప్రాణాలను కాపాడారని ఆయన అన్నారు. ‘‘ఆయన మా ప్రాణాలు కాపాడారు. మేం ఆయన ప్రాణాలు కాపాడాం. ఇది కర్మ’’ అని చెప్పారు.

ప్రస్తుతం స్మిత్‌ యూఏఈలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని యూఏఈలోని భారత రాయబార కార్యాలయం మంగళవారం తెలిపింది.
Advertisement
Advertisement
Smith Macher
FlyDubai pilot attack
Indian pilot Smith Macher
Dr Shuta Musayev
Hamam Al Hammami
Pilot attack mid-air

More Telugu News