వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది.. నమ్మొద్దు: డీఎస్సీ స్పోర్ట్స్ కోటా టీచర్ల విజ్ఞప్తి

వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది.. నమ్మొద్దు: డీఎస్సీ స్పోర్ట్స్ కోటా టీచర్ల విజ్ఞప్తి

DSC Sports Quota Teachers appeal not to believe YCP false propaganda
  • విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన 370 మంది ఉపాధ్యాయులు
  • ప్రతిభ, పతకాలతోనే ఉద్యోగాలు సాధించామని స్పష్టీకరణ
  • స్పోర్ట్స్ కోటాను 3 శాతానికి పెంచిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు
  • గాయాల కన్నా ఆరోపణలే ఎక్కువ బాధిస్తున్నాయని ఉపాధ్యాయుల ఆవేదన
మెగా డీఎస్సీ ద్వారా స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన తమ నియామకాలపై వైసీపీ ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తోందని పలువురు ఉపాధ్యాయులు తీవ్రంగా ఖండించారు. తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు విజయవాడలో సుమారు 370 మంది స్పోర్ట్స్ కోటా ఉపాధ్యాయులు ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి, తమ నిరసనను తెలియజేశారు.

ఈ సమావేశంలో టీచర్లు "అబద్ధాలు వద్దు - ఆత్మగౌరవం ముద్దు" అంటూ నినాదాలు చేశారు. తాము ఎంతో కష్టపడి, క్రీడల్లో పతకాలు సాధించి మెరిట్ ఆధారంగానే ఉద్యోగాలు పొందామని స్పష్టం చేశారు. మెగా డీఎస్సీ ప్రక్రియను అప్రతిష్ఠపాలు చేసే ప్రయత్నాలను సహించబోమని హెచ్చరించారు. ఈ సందర్భంగా, స్పోర్ట్స్ కోటాను 3 శాతానికి పెంచి తమకు న్యాయం చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సమావేశంలో పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. "కొంతమంది కావాలనే మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వైసీపీ నేతలు అనుకునే గాంబ్లింగ్, పేకాట స్పోర్ట్స్ కోటాలో ఉండవు. బ్రిడ్జి గేమ్ గురించి తెలియక పేకాట అని తప్పుగా ప్రచారం చేస్తున్నారు. మాపైకి రాజకీయాలు నెట్టవద్దు. ఆటల్లో తగిలిన శారీరక గాయాల కన్నా, వారి మాటలు మమ్మల్ని మానసికంగా ఎక్కువ బాధిస్తున్నాయి" అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. "ఆరోపణలు చేస్తున్న ఛానళ్లు, నాయకులు కళ్లు తెరిచి మా సర్టిఫికెట్లు చూడాలి. ప్రతిభ ఉంటే ఒకే కుటుంబంలో ఇద్దరికి ఉద్యోగాలు రాకూడదా?" అని వారు ప్రశ్నించారు. వైసీపీ చేస్తున్న నిరాధార ఆరోపణలను ప్రజలు నమ్మవద్దని వారు విజ్ఞప్తి చేశారు.
Advertisement
DSC Sports Quota Teachers
Mega DSC 2024
Chandrababu Naidu
Andhra Pradesh Education News
YSRCP False Propaganda
Vijayawada Teachers Meeting

More Telugu News