సాధిక్‌ఖాన్ విచారణలో కీలక పురోగతి.. నిజాలు కక్కిన నిందితుడు

సాధిక్‌ఖాన్ విచారణలో కీలక పురోగతి.. నిజాలు కక్కిన నిందితుడు

Sadhik Khan investigation key progress suspect confesses truths
  • నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో పురోగతి
  • మూడో రోజు విచారణలో నిజాలు ఒప్పుకున్న సాధిక్‌ఖాన్
  • విషం పెట్టి జగదీశ్వరరెడ్డిని హత్య చేసినట్లు అంగీకారం!
  • రూ.25 కోట్ల ఆస్తి కోసమే ఈ దారుణానికి పాల్పడినట్లు వెల్లడి
  • నేడు నిందితుడిని కోర్టులో హాజరుపరచనున్న పోలీసులు
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పంచాయతీరాజ్‌ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక పురోగతి లభించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన షేక్‌ సాధిక్‌ఖాన్‌ పోలీసుల విచారణలో నోరు విప్పినట్టు తెలిసింది. నూకరాజు అల్లుడు జగదీశ్వరరెడ్డిని తానే హత్య చేసినట్లు అంగీకరించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మూడో రోజు విచారణలో పోలీసులు పక్కా ఆధారాలు చూపడంతో సాధిక్‌ఖాన్‌ నిజాలు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.

మూడు రోజుల పోలీసు కస్టడీలో ఉన్న సాధిక్‌ఖాన్‌ను సర్పవరం పోలీసులు విచారిస్తున్నారు. తొలి రెండు రోజులు పొంతనలేని సమాధానాలిస్తూ, 'గుర్తులేదు', 'తెలియదు' అంటూ విచారణకు సహకరించలేదు. అయితే, గురువారం పోలీసులు సాంకేతిక ఆధారాలు, అతడికి సైనైడ్ విక్రయించిన వ్యాపారుల వాంగ్మూలాలను ముందుంచడంతో దిగివచ్చినట్లు సమాచారం. జగదీశ్వరరెడ్డిని చంపేందుకు విషపదార్థం ఉపయోగించినట్లు అంగీకరించినట్టు తెలిసింది.

సుమారు రూ.25 కోట్ల విలువైన ఆస్తిపై కన్నేసిన సాధిక్‌ఖాన్, నూకరాజు కుమార్తె సౌజన్యను వివాహం చేసుకుంటే ఆస్తి మొత్తం తనకే దక్కుతుందని భావించాడు. ఈ క్రమంలోనే అడ్డుగా ఉన్న జగదీశ్వరరెడ్డిని తొలగించుకోవాలని పథకం పన్నాడు. ఇందుకోసం హైదరాబాద్‌లోని వ్యాపారుల నుంచి రైఫిల్ షూటింగ్‌ అవసరాల పేరుతో థాలియం, పొటాషియం వంటి రసాయనాలను కొనుగోలు చేశాడు. తొలుత విషప్రయోగం చేసినా జగదీశ్వరరెడ్డి కోలుకోవడంతో, ఆ తర్వాత సైనైడ్‌ను ప్రొటీన్ పౌడర్ వంటి వాటిలో కలిపి ఇచ్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడించినట్లు తెలిసింది.

విచారణలో భాగంగా పోలీసులు సీన్ రీకన్‌స్ట్రక్షన్ కూడా నిర్వహించారు. నిందితుడిని గుడారిగుంటలోని ప్రో రైఫిల్ షూటింగ్ అకాడమీతో పాటు నూకరాజు, సౌజన్య నివాసాలకు తీసుకెళ్లి పలు ఆధారాలను సేకరించారు. సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణలో జరిగిన ఈ విచారణలో సాధిక్‌ఖాన్‌ కొన్ని విషయాల్లో నేరాన్ని సౌజన్యపై నెట్టే ప్రయత్నం చేసినట్లు కూడా పోలీసులు గుర్తించారు.

ఈ కేసుకు సంబంధించి కీలకమైన విషపదార్థాల నమూనాలను, ఇతర సాక్ష్యాధారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సాధిక్‌ఖాన్‌ను శుక్రవారం ఉదయం 10:30 గంటలకు కాకినాడ కోర్టులో హాజరుపరచనున్నారు. కాగా, ఆగస్టు 16న నూకరాజు, ఆయన భార్య, కుమార్తె గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకోవడం, అంతకుముందు జులై 2న అల్లుడు జగదీశ్వరరెడ్డి అనుమానాస్పద స్థితిలో మరణించడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.
Advertisement
Sadhik Khan
Nukaraju family suicide case
Jagadeeswara Reddy murder
Kakinada police investigation
Cyanide poisoning case
Thallium murder mystery

More Telugu News