ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జిపై 100 కిమీ వేగంతో వందే భారత్‌.. తొలిసారి

Vande Bharat runs at 100 kmph on worlds highest railway bridge for the first time
  • చీనాబ్‌ రైల్‌ బ్రిడ్జిపై తొలిసారి వందే భారత్‌ 100 కిమీ వేగం
  • కత్రా-బనిహాల్‌ మధ్య 111 కిమీ మార్గంలో గరిష్ఠ వేగం
  • గతంలో ఈ మార్గంలో గరిష్ఠ వేగం 75-85 కిమీ మాత్రమే
  • వేగం పెరగడంతో తగ్గిన ప్రయాణ సమయం
  • కశ్మీర్‌లో పర్యాటకం, వాణిజ్యానికి ఊతం
ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెనగా పేరున్న చీనాబ్‌ రైల్‌ బ్రిడ్జిపై తొలిసారిగా వందే భారత్‌ రైలు గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది. కత్రా-బనిహాల్‌ రైలు మార్గంలో గరిష్ఠ వేగ పరిమితిని 100 కిలోమీటర్లకు పెంచేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఈ వేగంతో రైలు నడిచింది.

జమ్మూ డివిజన్‌ సీనియర్‌ డివిజనల్‌ కమర్షియల్‌ మేనేజర్‌ ఉచిత్‌ సింఘాల్‌ గురువారం ఈ విషయాన్ని వెల్లడించారు. వేగం పెరగడంతో ప్రయాణ సమయం తగ్గడంతో పాటు జమ్మూ-కశ్మీర్‌ మధ్య రైలు కనెక్టివిటీ మరింత మెరుగుపడుతుందని తెలిపారు.

శ్రీ మాతా వైష్ణోదేవి కత్రా నుంచి బనిహాల్‌ వరకు ఉన్న 111 కిలోమీటర్ల కొత్త బ్రాడ్‌గేజ్‌ రైలు మార్గంలో రైళ్లను గరిష్ఠంగా గంటకు 100 కిలోమీటర్ల వేగంతో నడిపేందుకు అనుమతి లభించింది. ఇంతకుముందు కత్రా-సంగల్దాన్‌ మార్గంలో గరిష్ఠ వేగం 85 కిమీ, సంగల్దాన్‌-బనిహాల్‌ మార్గంలో 75 కిమీగా ఉండేది. అన్ని నిర్దేశిత భద్రతా ప్రమాణాలను పరిశీలించిన తర్వాతే వేగాన్ని పెంచేందుకు అనుమతి ఇచ్చినట్లు నార్తర్న్‌ రైల్వే తెలిపింది.

కొత్త వేగ పరిమితితో కత్రా నుంచి బనిహాల్‌ మధ్య ప్రయాణ సమయం మరింత తగ్గనుంది. దీంతో ప్రయాణికులకు వేగవంతమైన, సురక్షితమైన, సౌకర్యవంతమైన రైలు ప్రయాణం అందుబాటులోకి వస్తుందని రైల్వే అధికారులు తెలిపారు. రైలు కనెక్టివిటీ మెరుగుపడటంతో పర్యాటకం, వాణిజ్యం, స్థానిక ఆర్థిక కార్యకలాపాలకు కూడా ఊతం లభించే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

జమ్మూ-కశ్మీర్‌లోని చీనాబ్‌ రైల్‌ బ్రిడ్జి ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెనగా గుర్తింపు పొందింది. ఇది చీనాబ్‌ నదీ మట్టానికి 359 మీటర్లు (1,178 అడుగులు) ఎత్తులో నిర్మించారు.

ఈ వంతెన ఈఫిల్‌ టవర్‌ కంటే 35 మీటర్లు ఎత్తులో ఉండటం విశేషం. దీని పొడవు సుమారు 1,315 మీటర్లు. ఉక్కు, కాంక్రీట్‌తో నిర్మించిన ఈ ఆర్చ్‌ బ్రిడ్జి బలమైన గాలులు, భూకంపాలను తట్టుకునేలా రూపొందించారు.
Advertisement
Chenab Rail Bridge
Vande Bharat Express
Jammu and Kashmir
Indian Railways
Katra Banihal Rail Link
Worlds Highest Railway Bridge

More Telugu News