మహిళా ఎస్సైపై దాడి కేసు: 8 రోజుల తర్వాత చిక్కిన వైసీపీ నేత చింతాడ రవికుమార్

YCP leader Chintada Ravi Kumar arrested after 8 days in female SI assault case
  • మహిళా ఎస్సైపై దాడి కేసులో వైసీపీ నేత చింతాడ రవికుమార్ అరెస్ట్
  • పశ్చిమ బెంగాల్ నంబర్ కారులో వెళ్తుండగా చిలకపాలెం వద్ద పట్టివేత
  • లొంగిపోవడానికి వెళ్తుంటే పట్టుకున్నారన్న రవికుమార్
  • పరారీకి సహకరించిన వారిపైనా చర్యలు తప్పవన్న పోలీసులు
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. గత నెల 30న శ్రీకాకుళంలో బందోబస్తు విధుల్లో ఉన్న మహిళా ఎస్సై ప్రవల్లిక పట్ల అనుచితంగా ప్రవర్తించిన కేసులో ఆయన ప్రధాన నిందితుడు (ఏ1)గా ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదైన నాటి నుంచి ఆయన పరారీలో ఉన్నారు.

గత ఎనిమిది రోజులుగా పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న రవికుమార్‌ను శనివారం రాత్రి 8 గంటల సమయంలో చిలకపాలెం కూడలి వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్ రిజిస్ట్రేషన్ (WB36C 5000) కలిగిన కారులో మాస్క్ ధరించి వెళ్తుండగా ఆయన్ను పట్టుకున్నారు. పరారీలో ఉన్న సమయంలో రవికుమార్ నిరంతరం ఫోన్లు, సిమ్ కార్డులు మారుస్తూ ఒడిశా, విశాఖపట్నం, బెంగళూరు, అరకు వంటి ప్రాంతాల్లో మకాం మార్చినట్లు పోలీసులు గుర్తించారు.

అయితే, తాను డీఎస్పీ కార్యాలయంలో లొంగిపోవడానికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారని రవికుమార్ మీడియాకు తెలిపారు. నిందితుడిని ఆదివారం కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు వెల్లడించారు. రవికుమార్ పరారీకి సహకరించిన విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన వైసీపీ కీలక నేతలపై కూడా చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

ఈ కేసులో మొత్తం 28 మందిపై కేసులు నమోదు కాగా, ఇప్పటికే అరెస్టయిన అన్నెపు సంజయ్, బొడ్డేపల్లి రమేష్‌కుమార్‌ సహా తొమ్మిది మందికి కోర్టు ఈ నెల 21 వరకు రిమాండ్ విధించింది. అనంతరం వారిని అంపోలులోని జిల్లా కారాగారానికి తరలించారు.                                
Advertisement
Chintada Ravi Kumar
YSRCP leader arrest
Srikakulam SI assault case
Amadalavalasa YCP coordinator
Female SI Pravallika case
Andhra Pradesh Police

More Telugu News