అమెరికాలో చదువుతున్న భారత విద్యార్థులకు అలర్ట్‌.. సెప్టెంబర్‌ 15లోగా యూఎస్‌లో ఉండాలి!

Indian Students advised to return to USA before September 15 for visa benefits
  • సెప్టెంబర్‌ 15 నుంచి అమల్లోకి కొత్త వీసా విధానం
  • ఆ రోజున అమెరికాలో ఉంటేనే పాత విధానం వర్తింపు
  • ఆలస్యంగా వెళ్లేవారికి కొత్త వీసా నిబంధనలు
  • నాలుగేళ్ల బసకు కూడా ప్రత్యేక షరతులు
  • విదేశీ ప్రయాణం తర్వాత కొత్త నిబంధనలు అమలు
అమెరికాలో చదువుతున్న భారత విద్యార్థులకు ఇమ్మిగ్రేషన్‌ నిపుణులు కీలక సూచన చేశారు. ప్రస్తుతం సెలవుల కోసం భారత్‌తో పాటు ఇతర దేశాల్లో ఉన్న ఎఫ్‌-1 విద్యార్థి వీసాదారులు సెప్టెంబర్‌ 15లోగా అమెరికాకు చేరుకోవాలని సూచిస్తున్నారు. ఆ తేదీ నుంచి అమెరికా కొత్త వీసా నిబంధనలు అమల్లోకి రానుండటమే ఇందుకు కారణం. ఆ రోజున అమెరికాలోనే ఉండే విద్యార్థులకు ఇప్పటి వరకు అమల్లో ఉన్న ‘డ్యూరేషన్‌ ఆఫ్‌ స్టేటస్‌ (డీ/ఎస్‌)’ వెసులుబాటు కొనసాగుతుంది. ఆలస్యంగా వెళ్లేవారికి మాత్రం కొత్త నిబంధనలే వర్తిస్తాయి.

కొత్త నిబంధనల ప్రకారం సెప్టెంబర్‌ 15 తర్వాత అమెరికాలోకి వెళ్లే విద్యార్థులకు చదువు పూర్తయ్యే వరకు ఉండే పాత వెసులుబాటు ఉండదు. వారి ఐ-94లో నిర్దిష్ట గడువును నమోదు చేస్తారు. గరిష్ఠంగా నాలుగేళ్ల వరకు మాత్రమే బసకు అనుమతి ఉంటుంది. ఆ గడువు దాటితే మళ్లీ అనుమతి కోసం దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అయితే సెప్టెంబర్‌ 15 నాటికి అమెరికాలో ఉండి, ఎఫ్‌-1 వీసా నిబంధనలు పాటిస్తున్న వారికి మాత్రం కోర్సు పూర్తయ్యే వరకు పాత విధానం వర్తిస్తుంది.

అయితే ఈ వెసులుబాటు కూడా శాశ్వతం కాదని నిపుణులు చెబుతున్నారు. సెప్టెంబర్‌ 15 తర్వాత ఒకసారి అమెరికా నుంచి బయటకు వెళ్లి తిరిగి వస్తే కొత్త నిబంధనలే అమల్లోకి వస్తాయి. అలాగే నాలుగేళ్ల వరకు ఉండొచ్చని భావించడం కూడా తప్పేనని స్పష్టం చేస్తున్నారు. విద్యార్థి కోర్సు, వీసా నిబంధనలను ఎప్పటికప్పుడు పాటించినప్పుడే అమెరికాలో ఉండేందుకు అనుమతి ఉంటుంది. అందుకే ప్రస్తుతం సెలవుల్లో స్వదేశానికి వచ్చిన విద్యార్థులు సెప్టెంబర్‌ 15లోగా తిరిగి అమెరికాకు వెళ్లేలా ప్రయాణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Advertisement
Indian Students
US Student Visa
F1 Visa New Rules
September 15 Deadline
Duration of Status
US Immigration Update

More Telugu News