Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

114 ఏళ్ల తర్వాతా తగ్గని టైటానిక్‌ క్రేజ్‌.. వేలంలో భారీ ధర పలికిన అరుదైన వస్తువు

Titanic life jacket worn by survivor Laura Mabel Francatelli sold for 10 crore
Advertisement
  • టైటానిక్‌ లైఫ్‌ జాకెట్‌కు రికార్డు ధర
  • రూ.10 కోట్లకుపైగా అమ్ముడైన అరుదైన వస్తువు
  • లారా ఫ్రాంకటెల్లీ ధరించిన లైఫ్‌ జాకెట్‌
  • ఏడుగురు ప్రాణాలతో బయటపడిన వారి సంతకాలు
  • లైఫ్‌బోట్‌ నంబర్‌-1కు సంబంధించిన వివాదాస్పద చరిత్ర
  • 114 ఏళ్ల తర్వాతా తగ్గని టైటానిక్‌ ఆకర్షణ
Advertisement
టైటానిక్‌ మునిగి 114 ఏళ్లు గడిచినా.. ఆ విషాదానికి సంబంధించిన జ్ఞాపకాలు ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉన్నాయి. తాజాగా ఆ ఓడ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఓ మహిళ ధరించిన లైఫ్‌ జాకెట్‌ వేలంలో రికార్డు ధర పలికింది. చరిత్రలో తొలిసారిగా వేలానికి వచ్చిన ఈ అరుదైన వస్తువు రూ.10 కోట్లకుపైగా అమ్ముడై అందరి దృష్టినీ ఆకర్షించింది.

1912లో అట్లాంటిక్‌ మహాసముద్రంలో మునిగిపోయిన టైటానిక్‌ ఓడలో ప్రయాణించిన 22 ఏళ్ల లారా మాబెల్‌ ఫ్రాంకటెల్లీ ధరించిన లైఫ్‌ జాకెట్‌ను బ్రిటన్‌లోని హెన్రీ ఆల్డ్రిడ్జ్‌ అండ్‌ సన్‌ వేలం సంస్థ విక్రయించింది. ఈ లైఫ్‌ జాకెట్‌ 6.70 లక్షల పౌండ్లు (దాదాపు రూ.10 కోట్లకుపైగా)కు అమ్ముడైంది. వేలానికి ముందు దీని విలువ 2.5 లక్షల నుంచి 3.5 లక్షల పౌండ్ల మధ్య ఉంటుందని అంచనా వేసినా, చివరికి దానికి రెట్టింపుకుపైగా ధర లభించింది. ఫోన్‌ ద్వారా బిడ్‌ చేసిన ఓ వ్యక్తి దీన్ని కొనుగోలు చేసినట్లు వేలం సంస్థ వెల్లడించింది.

క్రీమ్‌ రంగు కాన్వాస్‌తో తయారైన ఈ లైఫ్‌ జాకెట్‌లో 12 కార్క్‌ ఫ్లోటేషన్‌ ప్యాడ్లు ఉన్నాయి. లారా ఫ్రాంకటెల్లీతో పాటు అదే లైఫ్‌బోట్‌లో ప్రాణాలతో బయటపడిన మరో ఏడుగురు ప్రయాణికుల సంతకాలు కూడా దీనిపై ఉన్నాయి. అందుకే ఇది సాధారణ వస్తువు కాకుండా చారిత్రక ఆధారంగా గుర్తింపు పొందింది. టైటానిక్‌ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన వ్యక్తి ఉపయోగించిన లైఫ్‌ జాకెట్‌ ఇప్పటివరకు వేలానికి రావడం ఇదే తొలిసారి అని వేలం నిర్వాహకులు తెలిపారు.

లారా ఫ్రాంకటెల్లీ బ్రిటిష్‌ ఫ్యాషన్‌ డిజైనర్‌ లేడీ లూసీ డఫ్‌ గోర్డన్‌కు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసేది. 1912 ఏప్రిల్‌ 14న సౌతాంప్టన్‌ నుంచి న్యూయార్క్‌కు తొలి ప్రయాణం ప్రారంభించిన టైటానిక్‌ మంచుకొండను ఢీకొట్టడంతో మునిగిపోయింది. ఆ సమయంలో లారా లైఫ్‌బోట్‌ నంబర్‌-1లో ఎక్కి ప్రాణాలు దక్కించుకుంది. 

టైటానిక్‌ ప్రమాదంలో సుమారు 710 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడగా, 1,500 మందికిపైగా ప్రయాణికులు, సిబ్బంది మృతి చెందారు. ఆ విషాద ఘటనకు సంబంధించిన వ్యక్తిగత వస్తువులు ఇప్పటికీ చరిత్ర ప్రేమికులను ఆకర్షిస్తున్నాయి. తాజాగా ఈ లైఫ్‌ జాకెట్‌కు లభించిన రికార్డు ధర.. టైటానిక్‌పై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి ఏమాత్రం తగ్గలేదని మరోసారి రుజువు చేసింది.
Advertisement
Advertisement
Titanic
Laura Mabel Francatelli
Titanic life jacket auction
Henry Aldridge and Son
Titanic survivor memorabilia
Rare Titanic items price

More Telugu News