కవితకు టీవీల్లో కనిపించాలనే పిచ్చి: గండ్ర వెంకటరమణా రెడ్డి

Gandra Venkata Ramana Reddy says Kavitha is obsessed with appearing on TV
  • కవిత తీవ్ర నిరాశ, నిస్పృహలతో రాజకీయాలు చేస్తున్నారన్న గండ్ర
  • యువత, ఉద్యమకారులు ప్రాణాలు కోల్పోవడానికి కాంగ్రెసే కారణమని వ్యాఖ్య
  • కాంగ్రెస్ ను వదిలేసి కవిత బీఆర్ఎస్ పార్టీని మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తోందని మండిపాటు

తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీరుపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వరంగల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కవిత తీవ్ర నిరాశ, నిస్పృహలతో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కేవలం టీవీల్లో, మీడియాలో కనిపించాలనే పిచ్చితోనే ఆమె ఏదేదో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.


తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో ఎంతో మంది యువకులు, ఉద్యమకారులు ప్రాణాలు కోల్పోవడానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని గండ్ర గుర్తుచేశారు. నాడు, నేడు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను ప్రశ్నించకుండా కవిత కేవలం బీఆర్ఎస్ పార్టీని మాత్రమే టార్గెట్ చేయడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటని నిలదీశారు. అమరుల కుటుంబాలకు కాంగ్రెస్ సర్కార్ నుంచి న్యాయం జరగాలని ఆమె ఎందుకు గళం విప్పడం లేదని ఆక్షేపించారు.


కాంగ్రెస్ వైఫల్యాలను వదిలేసి, బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు గుప్పించడం చూస్తుంటే కాంగ్రెస్, తెలంగాణ రక్షణ సేనల మధ్య ఏదో రహస్య మిత్రత్వం ఉందనే అనుమానాలు బలపడుతున్నాయని గండ్ర సంచలన ఆరోపణలు చేశారు. అధికార పార్టీతో లోపాయకారి ఒప్పందం కుదుర్చుకుని కవిత ఇలా ఏకపక్షంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

Advertisement
Gandra Venkata Ramana Reddy
Kalvakuntla Kavitha
Telangana Rakshana Sena
BRS Party
Telangana Politics
Congress Party Telangana

More Telugu News