అంతరిక్షంలోకి ‘వజ్ర కమలం’.. విక్రమ్-1తో చరిత్ర సృష్టించనున్న భారత్‌

  • స్కైరూట్‌ విక్రమ్-1 రాకెట్‌తో అంతరిక్షంలోకి వజ్ర కమలాన్ని పంపనున్న భారత్‌
  • బెంగళూరులో తయారైన ల్యాబ్‌-గ్రోన్‌ డైమండ్‌ కళాఖండానికి ఈ అరుదైన అవకాశం
  • భారత సంస్కృతి, ఆధ్యాత్మికతకు ప్రతీకగా కమలాన్ని ఎంపిక చేసిన కాస్మోస్‌ డైమండ్స్‌
  • రాకెట్‌ ప్రయోగాన్ని తట్టుకునేలా ప్రత్యేక బలం, వైబ్రేషన్‌ పరీక్షలు నిర్వహించిన సంస్థ
  • భారత కళాత్మకత, సాంకేతికతను ప్రపంచానికి చాటే ప్రయత్నంగా కంపెనీ వ్యాఖ్య
భారత్‌ తొలి ప్రైవేటు ఆర్బిటల్‌ రాకెట్‌ విక్రమ్-1 ప్రయోగంలో ఓ అరుదైన కళాఖండం అంతరిక్షంలోకి వెళ్లనుంది. బెంగళూరుకు చెందిన కాస్మోస్‌ డైమండ్స్‌ రూపొందించిన ల్యాబ్‌-గ్రోన్‌ వజ్ర కమలాన్ని ఈ మిషన్‌లో పంపనున్నట్లు సంస్థ ప్రకటించింది. భారతదేశంలో తయారైన ల్యాబ్‌-గ్రోన్‌ డైమండ్‌ కళాఖండం అంతరిక్షంలోకి వెళ్లడం ఇదే తొలిసారి కానుంది.

ఈ ప్రాజెక్టును ప్రకటిస్తూ విడుదల చేసిన వీడియోలో.. రాకెట్‌లో ఏ వస్తువును పంపాలనే విషయంలో తమ బృందం నెలల తరబడి చర్చించినట్లు సంస్థ తెలిపింది. ఒక పెద్ద వజ్రాన్ని పంపాలా, ప్రత్యేక ఆకృతిలో వజ్రాన్ని రూపొందించాలా అనే ఆలోచనలు చేసినప్పటికీ.. చివరకు భారత జాతీయ పుష్పమైన కమలాన్నే ఎంపిక చేసినట్లు వెల్లడించింది.

భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో కమలం పవిత్రత, సృష్టి, జ్ఞానోదయానికి ప్రతీకగా భావిస్తారని కంపెనీ పేర్కొంది. బుద్ధుడు, విష్ణువు, లక్ష్మీదేవి, బ్రహ్మ, సరస్వతీదేవి వంటి దైవాలతో కమలానికి ఉన్న అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ రూపకల్పన చేసినట్లు వివరించింది. అలాగే ‘కాస్మోస్‌’ అంటే విశ్వం అనే అర్థం వస్తుందని, భారత సృష్టి తత్వంలో విశ్వం కమలం నుంచి ఉద్భవించిందనే భావన కూడా తమ ఎంపికకు కారణమైందని తెలిపింది.

ఈ కళాఖండం రూపకల్పనలో అనేక నమూనాలను పరిశీలించిన అనంతరం బంగారంతో చేసిన కేంద్రభాగం చుట్టూ ల్యాబ్‌-గ్రోన్‌ వజ్రాలతో కమలాన్ని రూపొందించారు. బంగారంతో చేసిన మధ్యభాగం లక్ష్మీదేవి, బ్రహ్మదేవుడి ఆసనాన్ని సూచించేలా రూపొందించినట్లు సంస్థ వెల్లడించింది.

అంతరిక్ష ప్రయోగానికి అనువుగా ఉండేలా ఈ వజ్ర కమలంపై ప్రత్యేక పరీక్షలు నిర్వహించారు. రాకెట్‌ ప్రయోగ సమయంలో ఏర్పడే తీవ్ర ప్రకంపనలు, ఒత్తిడిని తట్టుకునేలా బలం, నిర్మాణ స్థిరత్వం, వైబ్రేషన్‌ పరీక్షలు పూర్తి చేసినట్లు కంపెనీ తెలిపింది. ప్రయోగ సమయంలో ఒక్క వజ్రం కూడా ఊడిపోకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నట్లు వెల్లడించింది.

ఈ కళాఖండం శాస్త్రీయ పేలోడ్‌ కాకపోయినా.. భారత కళాత్మకత, సాంకేతిక నైపుణ్యం, సంస్కృతిని ప్రపంచానికి చాటే ప్రతీకగా అంతరిక్షంలోకి పంపుతున్నట్లు కాస్మోస్‌ డైమండ్స్‌ పేర్కొంది. స్కైరూట్‌ ఏరోస్పేస్‌కు చెందిన విక్రమ్-1 విజయవంతమైతే.. కక్ష్యలోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టిన తొలి భారత ప్రైవేటు రాకెట్‌గా చరిత్ర సృష్టించనుంది.

Vikram-1
Skyroot Aerospace
Vajra Kamalam
Lab grown diamond
Cosmos Diamonds
India private space mission

More Telugu News