కవిత మణుగూరు పర్యటనలో ఉద్రిక్తత
- బాయిబాట కార్యక్రమంలో సింగరేణి కార్మికులను కలిసేందుకు యత్నించిన కవిత
- కవితను అడ్డుకున్న పోలీసులు.. తీవ్ర వాగ్వివాదం
- సింగరేణిలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్
తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టిన రెండో విడత ‘బాయిబాట’ కార్యక్రమం రెండో రోజు మణుగూరులో ఉద్రిక్తంగా సాగింది. మణుగూరులోని సింగరేణి పీకే ఓసీపీ-2 మైనింగ్ ప్రాంతాన్ని ఈరోజు ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఫస్ట్ షిఫ్ట్ ముగించుకుని వస్తున్న కార్మికులతో మాట్లాడేందుకు కవిత ప్రయత్నించగా, పోలీసులు ఆమెను అడ్డుకోవడంతో అక్కడ కాసేపు తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. అనంతరం సింగరేణి అధికారులు అనుమతించడంతో ఆమె కార్మికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం, యాజమాన్యం ముందు పలు డిమాండ్లను ఉంచారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు చెల్లించాల్సిన రూ. 50 వేల కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేసి సంస్థను ఆర్థిక సంక్షోభం నుండి గట్టెక్కించాలని డిమాండ్ చేశారు. వారసత్వ (డిపెండెంట్) ఉద్యోగాల భర్తీ అనేది సింగరేణి కార్మికుల హక్కు అని కవిత స్పష్టం చేశారు. దీనికోసం నెలకు రెండు సార్లు మెడికల్ బోర్డు నిర్వహించాలన్నారు. అలాగే, రికార్డులలో అలియాస్ (మారుపేర్లు) ఉన్న కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు, వారి నుండి అఫిడవిట్లు తీసుకుని పేర్లు మార్చే ప్రక్రియను సులభతరం చేయాలన్నారు.
సింగరేణిలో ఖాళీగా ఉన్న మూడు వేల ఉద్యోగాల భర్తీ కోసం వెంటనే కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని కవిత డిమాండ్ చేశారు. డిపెండెంట్ ఉద్యోగాల భర్తీ మరియు కార్మికుల సమస్యలపై ఈ నెల 20వ తేదీ లోపు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన అధికారిక ప్రకటన చేయకపోతే.. తాను ప్రకటించిన విధంగానే గాంధేయ మార్గంలో నిరవధిక నిరాహార దీక్షకు కూర్చుని తీరుతానని కవిత మరోసారి స్పష్టం చేశారు. ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇస్తేనే దీక్ష నిర్ణయాన్ని విరమించుకుంటామని ఆమె తెలిపారు.