కార్పొరేట్ ఉద్యోగానికి గుడ్‌బై.. నెలకు రూ.1.8 లక్షల ఆదాయం.. రెడ్డిట్‌లో వైరల్‌ పోస్ట్‌!

Goodbye to corporate job 18 lakh monthly income viral Reddit post
  • కార్పొరేట్ ఉద్యోగం వదిలి వ్యాపారం మొదలుపెట్టిన 33 ఏళ్ల మహిళ
  • ఇద్దరు రెగ్యులర్ క్లయింట్లతో పాటు మరో కొత్త ఒప్పందం కుదిరిందని వెల్లడి
  • డబ్బు కంటే కుటుంబంతో గడిపే స్వేచ్ఛే పెద్ద విజయమని చెప్పిన మహిళ
  • ఉద్యోగం వదిలే ముందు పొదుపు, స్పష్టమైన ప్రణాళిక తప్పనిసరని సూచన
  • తన అనుభవాలను రెడ్డిట్ వేదికగా పంచుకున్న మార్కెటింగ్ ప్రొఫెషనల్
కార్పొరేట్ ఉద్యోగంలో స్థిరమైన జీతాన్ని వదిలి సొంతంగా వ్యాపారం ప్రారంభించడం చాలామందికి పెద్ద సాహసమే. అయితే ఆ నిర్ణయమే తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని ఓ 33 ఏళ్ల మార్కెటింగ్ ప్రొఫెషనల్ వెల్లడించారు. ప్రస్తుతం నెలకు రూ.1.8 లక్షలకు పైగా సంపాదిస్తూనే కుటుంబంతో సమయం గడుపుతూ తనకు నచ్చిన జీవితం గడుపుతున్నట్లు తెలిపారు.

రెడ్డిట్‌లో ‘Quit my full-time job 2 years ago. Now earning 180k+ a month and honestly living my best life’ అనే శీర్షికతో ఆమె తన అనుభవాలను పంచుకున్నారు. ఇది డబ్బు గురించి గొప్పలు చెప్పుకోవడానికి కాదని, తాను కోరుకున్న జీవితాన్ని సాధించగలిగాననే సంతోషాన్ని పంచుకోవడానికేనని పేర్కొన్నారు. ఒకప్పుడు రోజుకు 14 నుంచి 16 గంటలు ఉద్యోగం కోసం కష్టపడేదాన్నని, ఇప్పుడు ఆ జీవితం గతంలా అనిపిస్తోందని చెప్పారు.

2024 మధ్యలో కార్పొరేట్ ఉద్యోగానికి రాజీనామా చేసి మార్కెటింగ్ సర్వీసెస్ వ్యాపారాన్ని ప్రారంభించినట్లు వెల్లడించారు. మొదట్లో క్లయింట్లను సంపాదించడం, పని విధానాలను మెరుగుపరచడం, వ్యాపారానికి బలమైన వ్యవస్థలను రూపొందించడం వంటి సవాళ్లను ఎదుర్కొన్నానని తెలిపారు. క్రమంగా పరిస్థితులు మారి ప్రస్తుతం ఇద్దరు రెగ్యులర్ క్లయింట్లతో పనిచేస్తున్నానని, ఇటీవల మరో కొత్త క్లయింట్ కూడా చేరాడని చెప్పారు. ఈ ఏడాది ముగిసేలోపు మరికొన్ని ఒప్పందాలు కుదుర్చుకోవడమే లక్ష్యమని వివరించారు.

ఇప్పటికీ క్లయింట్ కాల్స్‌, ఎక్కువసేపు పని, అప్పుడప్పుడు ప్రయాణాలు ఉన్నప్పటికీ, ఎప్పుడు పని చేయాలో తానే నిర్ణయించుకోవడం తనకు అతిపెద్ద మార్పుగా అనిపిస్తోందని తెలిపారు. ఇక రోజూ ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేదని, మధ్యాహ్నం కావాలంటే కూరగాయలు కొనడానికి వెళ్లొచ్చని, పని దినాల్లోనే కూతురును బీచ్‌కు తీసుకెళ్లొచ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం తన గ్రామంలోని ఇంటి నుంచే వర్షాకాలాన్ని ఆస్వాదిస్తూ రిమోట్‌గా పనిచేస్తున్నానని వెల్లడించారు.

వ్యాపారం ప్రారంభించాలని భావించే వారికి ఆమె మూడు కీలక సూచనలు చేశారు. సరిపడా పొదుపు, ప్రత్యామ్నాయ ఆర్థిక భరోసా లేకుండా ఉద్యోగం వదలొద్దని సూచించారు. ఎక్కువ చెల్లించే క్లయింట్ల కోసమే పరుగులు పెట్టకుండా, చిన్న క్లయింట్లతో పనిచేస్తూ వ్యాపార వ్యవస్థలను బలోపేతం చేసుకోవాలని తెలిపారు. అలాగే వ్యక్తిగత ప్రతిభ ఒక్కటే సరిపోదని, స్పష్టమైన పని విధానాలు (ఎస్‌ఓపీలు), ఫలితాలను అంచనా వేసే వ్యవస్థ, క్లయింట్లకు దీర్ఘకాల ప్రయోజనం కనిపించేలా పనిచేయడం వ్యాపార విజయానికి కీలకమని వివరించారు.

ఈ పోస్టుపై స్పందించిన పలువురు రెడ్డిట్ వినియోగదారులు ఆమె నిర్ణయాన్ని అభినందించారు. కార్పొరేట్ జీవితానికి బదులుగా స్వతంత్రంగా పనిచేస్తూ కుటుంబంతో సమయం గడపడం నిజమైన విజయమని, భవిష్యత్తులో తామూ ఇలాంటి మార్గాన్ని ఎంచుకోవాలని భావిస్తున్నట్లు పలువురు వ్యాఖ్యానించారు.
Advertisement
Marketing Professional
Reddit Viral Post
Corporate Job Resignation
Marketing Services Business
Work Life Balance
Career Success Story

More Telugu News