కడుపు ఉబ్బరంగా ఉందా? చిలగడదుంపతో ఉపశమనం కలిగించొచ్చంటున్న నిపుణులు!

  • కడుపు ఉబ్బరానికి చిలగడదుంప ఉపయోగకరమని సూచనలు
  • యారాపిన్‌ ప్రొటీన్‌ జీర్ణవ్యవస్థకు మేలు చేసే అవకాశం
  • పీచు పదార్థం గ్యాస్‌, మలబద్ధకం తగ్గించడంలో తోడ్పాటు
  • ఉడికించి లేదా కాల్చి తింటే మంచి ప్రయోజనం
  • కొన్ని ఆరోగ్య సమస్యలున్నవారు జాగ్రత్త అవసరం
  • తీవ్ర లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించాలని సూచన
కడుపు ఉబ్బరం, గ్యాస్‌ సమస్యతో చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి సమయంలో చిలగడదుంప తినడం కొంత ఉపశమనం ఇవ్వొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే ‘యారాపిన్‌’ అనే సహజ ప్రొటీన్‌తో పాటు పీచు పదార్థం జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయని తాజా పరిశోధనలు సూచిస్తున్నాయి. అయితే ఇది మందులకు ప్రత్యామ్నాయం కాదని, సమతుల ఆహారంలో భాగంగా మాత్రమే తీసుకోవాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

చిలగడదుంపలో ఉండే యారాపిన్‌ శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. శరీరంలోని ఆక్సిడేటివ్‌ ఒత్తిడిని తగ్గించటంతో పాటు కాలేయ ఆరోగ్యానికి కూడా తోడ్పడే అవకాశం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. ముఖ్యంగా జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో ఈ ప్రొటీన్‌ పాత్ర ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు.

ఎక్కువగా గ్యాస్‌ పేరుకుపోవడం, మలబద్ధకం, ఆహారం నెమ్మదిగా జీర్ణం కావడం, పేగుల్లో మంచి బ్యాక్టీరియా సమతుల్యం దెబ్బతినడం, అతిగా తినడం లాంటి కారణాలతో కడుపు ఉబ్బరం వస్తుంది. చిలగడదుంపలో ఉండే పీచు పదార్థం మల విసర్జనను సులభం చేసి గ్యాస్‌ సమస్య తగ్గేందుకు తోడ్పడుతుంది. పేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరగడానికి కూడా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

చిలగడదుంపలో పొటాషియం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో నీటి సమతుల్యాన్ని కాపాడటంలో సాయపడుతుంది. ఉడికించి, కాల్చి లేదా సూప్‌ రూపంలో తీసుకుంటే శరీరం పోషకాలను సులభంగా గ్రహిస్తుంది. పెరుగు, కూరగాయలు లేదా ప్రొటీన్‌ ఉన్న ఆహారంతో కలిపి తింటే మరింత మేలు జరుగుతుందని వైద్యులు సూచిస్తున్నారు.

అయితే అందరికీ ఒకే విధంగా ఫలితం ఉండదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇరిటబుల్‌ బవెల్‌ సిండ్రోమ్‌ (ఐబీఎస్‌), మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు, కార్బోహైడ్రేట్లను నియంత్రించాల్సినవారు వైద్యుల సలహాతో మాత్రమే చిలగడదుంప తీసుకోవాలి. కడుపు ఉబ్బరం తరచూ వస్తుంటే, తీవ్రమైన నొప్పి, బరువు తగ్గడం, మలంలో రక్తం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

Sweet Potato
Stomach Bloating
Yarapin Protein
Digestion Benefits
Gas Relief
Gut Health

More Telugu News