హెచ్-1బీ వీసా మోసాలపై ట్రంప్ ప్రభుత్వం ఉక్కుపాదం.. కాగ్నిజెంట్ సంస్థపై దర్యాప్తు.. టెన్షన్‌లో భారత ఐటీ రంగం!

  • హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం 
  • ఐటీ సంస్థ 'కాగ్నిజెంట్' పై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడి  
  • విజిల్‌బ్లోయర్ల సమాచారంతో ఇప్పటికే డజన్ల కొద్దీ సమ్మన్లు 
  • వీసా మోసాలు, హ్యూమన్ ట్రాఫికింగ్‌ల వెనుక అంతర్జాతీయ కార్టెల్స్ హస్తం  
  • అమెరికాలో 71 శాతం హెచ్-1బీ వీసాలు భారతీయులవే కావడంతో ఆందోళన 
అమెరికాలో ఉద్యోగాలు చేయాలనుకునే విదేశీ ఐటీ నిపుణులకు, ముఖ్యంగా భారతీయ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. హెచ్-1బీ, పర్మ్ వర్క్ వీసాల జారీలో జరుగుతున్న భారీ అక్రమాలు, మోసాలపై ట్రంప్ యంత్రాంగం అతిపెద్ద దర్యాప్తును ప్రారంభించింది. ఈ భారీ విచారణ వివరాలను వెల్లడిస్తూ.. ప్రముఖ ఐటీ సేవల దిగ్గజం 'కాగ్నిజెంట్' సంస్థపైనా దర్యాప్తు చేస్తున్నట్లు అమెరికా ఉన్నతాధికారి ఒకరు అధికారికంగా ప్రకటించారు.  

అమెరికా కార్మిక విభాగం ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆంథోనీ డి'ఎస్పోసిటో బుధవారం ఫాక్స్ బిజినెస్‌తో మాట్లాడుతూ.. విదేశీ కార్మికుల వీసాల మోసాలను అరికట్టడానికి ప్రభుత్వం అత్యంత దూకుడుగా వ్యవహరిస్తోందని, ఇందులో భాగంగా దర్యాప్తు సంస్థలు ఇప్పటికే డజన్ల కొద్దీ సమ్మన్లు, సబ్‌పోనాలను జారీ చేశాయని వెల్లడించారు. "కాగ్నిజెంట్ వంటి కొన్ని అతిపెద్ద కంపెనీలలో పర్మనెంట్ రెసిడెన్సీ స్పాన్సర్‌షిప్‌లు, హెచ్-1బీ వీసాల దుర్వినియోగానికి సంబంధించి విజిల్‌బ్లోయర్లు మాకు కీలక సమాచారం ఇచ్చారు. అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని 'ఫ్రాడ్ టాస్క్‌ఫోర్స్'తో కలిసి మేము ప్రతి ఆధారాన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం" అని ఆయన పేర్కొన్నారు. అయితే, కాగ్నిజెంట్ సంస్థ ఏదైనా తప్పు చేసిందని తాము ఇప్పటికిప్పుడు నిర్ధారించడం లేదని, కేవలం విజిల్‌బ్లోయర్ల ఫిర్యాదుల ఆధారంగానే విచారణ జరుపుతున్నామని స్పష్టం చేశారు. వైట్ హౌస్ మీడియా కార్యదర్శి కూడా సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని ధ్రువీకరించారు.   

ఈ వీసా మోసాలు కేవలం ఇమ్మిగ్రేషన్ నిబంధనల ఉల్లంఘనలకే పరిమితం కాలేదని, వీటి వెనుక అంతర్జాతీయ నేర ముఠాల (కార్టెల్స్) హస్తం ఉందని ఇన్‌స్పెక్టర్ జనరల్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ వీసా స్కామ్‌లు, హ్యూమన్ ట్రాఫికింగ్ (మానవ అక్రమ రవాణా)ల ద్వారా వస్తున్న డబ్బు హింసాత్మక నేరాలకు పెట్టుబడిగా మారుతోందని, అమెరికా పౌరుల ఉపాధిని రక్షించడంతో పాటు దేశ భద్రతను పటిష్టం చేయడానికే ఈ దర్యాప్తు చేపట్టామని ఆయన వివరించారు. 

ఈ దర్యాప్తు భారతదేశంలో తీవ్ర కలకలం రేపే అవకాశం ఉంది. ఎందుకంటే అమెరికాలో హెచ్-1బీ వీసాలు పొందుతున్న వారిలో అత్యధిక శాతం మంది భారతీయులే ఉన్నారు. 2024 ఆర్థిక సంవత్సరంలో ఆమోదించబడిన మొత్తం హెచ్-1బీ వీసాలలో దాదాపు 71 శాతం వాటా భారతీయులదే కావడం గమనార్హం. వేలాది మంది భారతీయ సాఫ్ట్‌వేర్ డెవలపర్లు, ఇంజనీర్లు, పరిశోధకులు అమెరికాలో స్థిరపడటానికి ఈ వీసా ప్రోగ్రామ్ ఒక ముఖ్యమైన మార్గంగా ఉంది. అటు భారతీయ ఐటీ కంపెనీలు, ఇటు అమెరికన్ టెక్ కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , క్లౌడ్ కంప్యూటింగ్ వంటి రంగాలలో నిపుణుల కొరతను తీర్చడానికి ఈ వీసాలపైనే ఎక్కువగా ఆధారపడుతుండటంతో..  ట్రంప్ ప్రభుత్వ తాజా నిర్ణయం ఐటీ రంగంలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

Donald Trump
H-1B Visa Fraud
Cognizant Investigation
Indian IT Sector
US Visa Scam
Department of Labor

More Telugu News