అమెరికాలో భార్యను చంపి బాత్రూం డ్రామా ఆడిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అరెస్ట్

Software engineer arrested in USA for killing wife and staging bathroom drama
  • గతేడాది అక్టోబర్‌లో రాజిత అనుమానాస్పద మృతి
  • పక్కా ప్రణాళికతో భార్యను హత్య చేసిన భర్త అవినాశ్ నార్నే 
  • స్మార్ట్ స్మార్ట్‌లాక్ డేటా, ఫోన్ కాల్స్ ఆధారంగా అరెస్ట్
  • రూ.41 కోట్లు చెల్లించి బెయిల్ తీసుకోవచ్చన్న న్యాయస్థానం
అమెరికాలోని వాషింగ్టన్‌ రాష్ట్రం బెల్‌వ్యూ (సియాటెల్ సమీపంలో)లో గతేడాది అక్టోబరులో చోటుచేసుకున్న భారతీయ మహిళ రాజిత సబ్బినేని (27) అనుమానాస్పద మృతి కేసులో దర్యాప్తు అధికారులు సంచలన విషయాలు వెల్లడించారు. ఈ కేసులో ఆమె భర్త, ప్రముఖ ఐటీ సంస్థలో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న అవినాశ్‌ నార్నే (30) ప్రణాళికాబద్ధంగా భార్యను గొంతునులిమి హత్య చేసినట్లు కింగ్ కౌంటీ ప్రాసిక్యూటర్ కార్యాలయం నిర్ధారించింది. ఈ మేరకు జులై 1న అతడిపై ఫస్ట్-డిగ్రీ మర్డర్ అభియోగాలు మోపి, అరెస్ట్ చేసి కింగ్ కౌంటీ జైలుకు తరలించారు. కోర్టు అతడికి 5 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 41 కోట్లు) భారీ బెయిల్ మొత్తాన్ని విధించింది. ఈ మొత్తాన్ని చెల్లిస్తే అతడు బెయిల్‌పై బయటకు వచ్చి విచారణ పూర్తయ్యే వరకు బయటే ఉండొచ్చు. అయితే, అంత సొమ్ము చెల్లించే అవకాశం లేదు కాబట్టి విచారణ పూర్తయ్యే వరకు అతడు జైలులోనే ఉండాల్సి ఉంటుంది.

గతేడాది అక్టోబర్‌ 27 రాత్రి అవినాశ్ పోలీసులకు ఫోన్ చేసి, తన భార్య బాత్‌రూమ్‌లో లోపల లాక్ చేసుకుని బయటకు రావడం లేదని ఫిర్యాదు చేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు బద్దలు కొట్టి చూడగా, రాజిత అపస్మారక స్థితిలో పడి ఉంది. ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోస్ట్‌మార్టం నివేదికలో ఆమె గొంతునులమడం వల్లే (అస్ఫిక్సియా) ఊపిరాడక చనిపోయిందని తేలింది. తాము 2025 జూన్‌లోనే వివాహం చేసుకున్నామని, తాను బయటకు వెళ్లి వచ్చేసరికి భార్య బాత్‌రూమ్‌లో ఉందని అవినాశ్ పోలీసులను నమ్మించే ప్రయత్నం చేశాడు.

అయితే, పోలీసులు అతడి డిజిటల్ ఆధారాలను పరిశీలించడంతో అసలు నిజాలు బయటపడ్డాయి. అపార్ట్‌మెంట్ 'స్మార్ట్ లాక్' డేటాను తనిఖీ చేయగా, అవినాశ్ బయటకు వెళ్లిన సమయంలో మరెవరూ ఇంట్లోకి ప్రవేశించలేదని స్పష్టమైంది. అంతేకాకుండా, అవినాశ్‌కు భారతదేశంలో ఒక మహిళతో రహస్య బంధం ఉందని, ఆమె వీరి పెళ్లికి కూడా హాజరైందని పోలీసులు గుర్తించారు. రాజిత చనిపోయిన రోజున అవినాశ్ సదరు మహిళకు నాలుగు సార్లు ఫోన్ చేశాడని, మరుసటి రోజు భార్య మృతదేహం ఫోటోను కూడా ఆమెకు పంపినట్లు నిరూపితమైంది. చనిపోవడానికి ముందు రాజిత భర్త తనకు ఇచ్చిన డ్రింక్స్, స్మూతీలు చేదుగా, మందుల వాసన వస్తున్నాయంటూ పంపిన మెసేజ్‌లను కూడా పోలీసులు ఆధారాలుగా సేకరించారు. దాదాపు 8 నెలల సుదీర్ఘ దర్యాప్తు అనంతరం అన్ని పక్కా సాక్ష్యాలతో పోలీసులు అవినాశ్‌ను అరెస్ట్ చేశారు.
Advertisement
Avinash Narne
Rajitha Sabbineni
US Software Engineer Murder
Bellevue Washington Murder Case
Indian Techie Arrested USA
King County Murder Investigation

More Telugu News