మలయాళం నుంచి మరో హారర్ మూవీ .. ఓటీటీలో!
- మలయాళం నుంచి వస్తున్న 'కరక్కం'
- ప్రధానమైన పాత్రలో శ్రీనాథ్ భాసి
- మే 28న థియేటర్లకు వచ్చిన సినిమా
- 'సోనీ లివ్'కి దక్కిన ఓటీటీ హక్కులు
- ఈ నెల 3వ తేదీ నుంచి స్ట్రీమింగ్
అంకుశ్ సింగ్ నిర్మించిన ఈ సినిమాకి, సుభాశ్ లలిత - సుబ్రహ్మణ్యం దర్శకత్వం వహించారు. 'మంజుమేల్ బాయ్స్' సినిమాలో లోయలో పడిపోయిన పాత్రను పోషించిన శ్రీనాథ్ భాసి ఈ సినిమాలో ప్రధానమైన పాత్రలో కనిపిస్తాడు. ఫెమీనా జార్జ్ .. సిద్ధార్థ్ భరత్ ఇతర ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. ఈ నెల 3వ తేదీ (శుక్రవారం) నుంచి ఈ సినిమా 'సోనీ లివ్'లో స్ట్రీమింగ్ కానుంది. సామ్ సీఎస్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, మలయాళంతో పాటు తెలుగులోను అందుబాటులోకి రానుంది.
కొత్త ఏడాది వేడుకలలో హీరో .. అతని ఫ్రెండ్స్ పీకలదాకా తాగేస్తారు. తాము ఏం చేస్తున్నామనే విషయం కూడా తమకి తెలియని ఒక స్థితిలో ఉంటారు. ఆ సమయంలోనే వాళ్లు ఒక శ్మశానంలోకి వెళతారు. అక్కడి సమాధులను కదిలిస్తారు. ఆ తరువాత అక్కడి నుంచి వెళ్లిపోతారు. దెబ్బతిన్న ఆ సమాధులలో నుంచి ఐదు ప్రేతాత్మలు బయటికి వస్తాయి. వాటి కారణంగా వాళ్లకి ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయనేది మిగతా కథ. ఓటీటీ వైపు నుంచి ఈ సినిమాకి ఒక రేంజ్ రెస్పాన్స్ రావడం ఖాయమనే మాటైతే వినిపిస్తోంది మరి.