మంగళగిరిలో ఓడిపోయాక ఎంతో బాధపడ్డా.. దేవాన్ష్‌తో చెస్ ఆడితే పరువు పోయింది: నారా లోకేశ్
- తాను, దేవాన్ష్ అన్నదమ్ముల్లా కొట్టుకుంటామన్న లోకేశ్
- మంగళగిరిలో ఓడిపోయిన తర్వాత తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యానని వెల్లడి
- తక్కువ మార్కులు వచ్చాయనో, ఫెయిల్ అయ్యామనో కఠిన నిర్ణయాలు తీసుకోవద్దని విద్యార్థులకు సూచన
ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తన కుమారుడు దేవాన్ష్‌తో ఉన్న వ్యక్తిగత అనుబంధం, తన రాజకీయ జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులపై చేసిన కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. ఇటీవల టెన్త్, ఇంటర్ పరీక్షల్లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన ప్రభుత్వ స్కూళ్ల టాప్ స్టూడెంట్స్ అభినందన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో జరిగిన ముఖాముఖిలో లోకేశ్ తన కుటుంబానికి చెందిన విషయాలతో పాటు రాజకీయ, విద్యా వ్యవస్థకు సంబంధించిన ఎన్నో విషయాలను ఓపెన్‌గా షేర్ చేసుకున్నారు.
ఇంట్లో తాను, తన కుమారుడు దేవాన్ష్ ఇద్దరం తండ్రీకొడుకుల్లా కాకుండా ఎప్పుడూ అన్నదమ్ముల్లా కొట్టుకుంటూ ఉంటామని లోకేశ్ సరదాగా నవ్వించేశారు. సాధారణంగా పిల్లలకు తండ్రులు సలహాలు ఇస్తుంటారు కానీ, తాను మాత్రం దేవాన్ష్‌కు ఎలాంటి సలహాలు ఇవ్వనని.. ఆ హోమ్ డిపార్ట్‌మెంట్ బాధ్యతలను తన భార్య బ్రహ్మణియే పక్కాగా చూసుకుంటుందని స్పష్టం చేశారు. ఇదే క్రమంలో ఒకసారి దేవాన్ష్‌తో తాను చెస్ గేమ్ ఆడి ఘోరంగా ఓడిపోయానని.. ఆ దెబ్బతో కొడుకు ముందు తన పరువంతా పోయిందంటూ ఆయన చెప్పడంతో... అక్కడ ఉన్న స్టూడెంట్స్, పేరెంట్స్ అందరూ నవ్వుకున్నారు.
2019 ఎన్నికల్లో తాను మంగళగిరి నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయినప్పుడు తీవ్రమైన మానసిక ఒత్తిడికి, బాధకు గురయ్యానని గుర్తుచేసుకున్నారు. కానీ ఆ ఓటమితో కుంగిపోకుండా, పట్టువదలకుండా ఐదేళ్ల పాటు గ్రౌండ్ లెవెల్‌లో జనం మధ్యే ఉండి నిరంతరం కష్టపడటం వల్లే.. మొన్నటి ఎన్నికల్లో ఏకంగా 91 వేల భారీ మెజారిటీతో పబ్లిక్ తనను గెలిపించారని చెప్పారు. పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయని లేదా ఫెయిల్ అయ్యామని స్టూడెంట్స్ ఎవరూ సూసైడ్స్ లాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవద్దని.. ‘FAIL’ అంటే ‘First Attempt In Learning’ (నేర్చుకోవడంలో మొదటి ప్రయత్నం) అంటూ విద్యార్థుల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. తాను కూడా భారతీయ విద్యా వ్యవస్థ కంటే అమెరికా ఎడ్యుకేషన్ సిస్టమ్‌లోనే ఎక్కువగా సక్సెస్ అయ్యానని తన స్వీయ అనుభవాన్ని పంచుకున్నారు.
మంత్రిగా బాధ్యతలు తీసుకున్న వంద రోజుల్లోనే ప్రభుత్వ పాఠశాలలకు పూర్వవైభవం తెచ్చేలా ‘వన్ క్లాస్, వన్ టీచర్’ లాంటి ఎన్నో సంస్కరణలు తెచ్చామని లోకేశ్ గర్వంగా చెప్పుకొచ్చారు. ఒకప్పుడు ప్రభుత్వ స్కూళ్లు అంటే చిన్నచూపు ఉండేదని.. కానీ ఈరోజు ప్రైవేట్ స్కూళ్లను మించి గవర్నమెంట్ స్టూడెంట్స్ రికార్డులు క్రియేట్ చేయడం వెనుక టీచర్లు, తల్లిదండ్రుల కష్టం ఉందని ప్రశంసించారు.