సమంత గర్భవతి అని తెలియగానే ఏం చేశామంటే..: నందిని రెడ్డి
- త్వరలోనే తల్లి కాబోతున్న సమంత
- 'మా ఇంటి బంగారం' సినిమా షూటింగ్ లో తాను ప్రెగ్నెంట్ అని సామ్ చెప్పిందన్న నందిని
- సమంత కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నామని వెల్లడి
దక్షిణ భారత సినీ రంగంలో తనకంటూ ఒక సొంత బ్రాండ్ సృష్టించుకున్న అగ్ర కథానాయిక సమంత త్వరలోనే తల్లి కాబోతున్న సంగతి తెలిసిందే. తన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ షూటింగ్ సమయంలోనే ఆమె గర్భం దాల్చారు. సమంత ప్రెగ్నెంట్ అయిన విషయం గురించి దర్శకురాలు నందిని రెడ్డి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
సాధారణంగా సమంత ప్రొఫెషనలిజం ఏ రేంజ్లో ఉంటుందో అందరికీ తెలిసిందే. ఉదయం 9 గంటలకు షూట్ అంటే కచ్చితంగా సెట్లో ఉండే సమంత.. ఈ సినిమాలోని ‘తస్సాదియా’ సాంగ్ షూటింగ్ షెడ్యూల్ అప్పుడు సడన్‌గా తనకు జ్వరం వచ్చిందని, 11:30 గంటలకు వస్తానని నందిని రెడ్డికి సమాచారం పంపారు. మొదట నాలుగు రోజులు ప్లాన్ చేసిన ఈ సాంగ్‌ను అనుకోని కారణాల వల్ల రెండు రోజుల్లోనే కంప్లీట్ చేయాల్సి రావడం, మరోవైపు సామ్ హెల్త్ బాలేకపోవడంతో డైరెక్టర్‌గా నందిని రెడ్డి తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యారు.
కానీ చెప్పిన టైమ్‌కే సెట్స్‌కు వచ్చిన సమంత.. సైలెంట్‌గా షూట్ కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోయారు. మరుసటి రోజు కూడా సమంత డల్ గా ఉండటంతో, అసలు నీకు ఎందుకు తరచూ జ్వరం వస్తోందని నందిని రెడ్డి గట్టిగా అడిగేశారు. ఆ సమయంలోనే సమంత నందిని రెడ్డి దగ్గరకు వచ్చి.. "నాకు జ్వరం కాదు.. నేను ప్రెగ్నెంట్‌ని, ఈ విషయం ప్రస్తుతానికి ఎవరికీ చెప్పకు" అంటూ తన జీవితంలోనే అత్యంత సంతోషకరమైన విషయాన్ని పంచుకున్నారు.
ఈ సంతోషకరమైన వార్త వినగానే నందిని రెడ్డి ఒక్కసారిగా షాక్‌తో పాటు విపరీతమైన ఆనందానికి గురయ్యారు. సమంత గర్భంతో ఉందనే విషయం తెలియగానే షూటింగ్ స్పాట్లో విపరీతమైన జాగ్రత్తలు తీసుకున్నారు. వెంటనే డ్యాన్స్ మాస్టర్ వద్దకు వెళ్లి సమంతకు హెల్త్ బాలేదని అబద్ధం చెప్పి, ఎక్కువ రిహార్సల్స్ లేకుండా సింపుల్ స్టెప్స్‌తోనే సాంగ్ మేనేజ్ చేయాలని ఆర్డర్ వేశారు.
సమంతకు మార్నింగ్ సిక్నెస్ (గర్భధారణ సమయంలో వచ్చే నీరసం, వాంతులు) ఉన్నప్పటికీ.. ఆ కష్టాన్ని ఏమాత్రం స్క్రీన్‌పై చూపించకుండా డ్యాన్స్ పూర్తి చేయడం విశేషం. ఆ తర్వాత షూట్ చేసిన కార్ యాక్సిడెంట్, ఛేజింగ్ సీన్స్ సమయంలో కూడా సమంతపై ఎలాంటి ప్రెజర్ పడకుండా, మధ్యాహ్నం 3:30 దాటిన తర్వాత కేవలం నీడలోనే షాట్స్ తీస్తూ షూటింగ్ పూర్తి చేశారు నందిని రెడ్డి. సమంతను స్క్రీన్‌పై బెస్ట్‌గా ప్రెజెంట్ చేయాలని తమ యూనిట్ మొత్తం కష్టపడిందని నందిని తెలిపారు.