బంగారం చిమ్మే అగ్నిపర్వతం.. ఏటా రూ.19 కోట్ల విలువైన పసిడి గాల్లోకి!
- అంటార్కిటికాలోని మౌంట్ ఎరెబస్ ప్రత్యేక అగ్నిపర్వతం
- రోజూ 80 గ్రాముల బంగారం సూక్ష్మ కణాల విడుదల
- బంగారం వెయ్యి కి.మీ. దూరం వరకు ప్రయాణం
- సూక్ష్మ స్ఫటికాల రూపంలో బయటకు
అంటార్కిటికాలోని రాస్ దీవిలో ఉన్న ‘మౌంట్ ఎరెబస్’ ప్రపంచంలోనే అత్యంత దక్షిణాన యాక్టివ్గా ఉన్న అగ్నిపర్వతం. ఇందులో ఎప్పుడూ మరిగే లావా సరస్సు ఉంటుంది. అదే దీని ప్రత్యేకతల్లో ఒకటి. మరో విశేషం ఏంటంటే.. ఈ అగ్నిపర్వతం నుంచి రోజూ సుమారు 80 గ్రాముల స్వచ్ఛమైన బంగారం సూక్ష్మ స్ఫటికాల రూపంలో బయటకు వస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రస్తుత బంగారం ధరల ప్రకారం చూస్తే ఇది రోజుకు సుమారు రూ.5.6 లక్షలు, ఏడాదికి దాదాపు రూ.19 కోట్ల విలువ చేస్తుంది.
ఈ బంగారం సాధారణంగా కనిపించే ధూళి కాదు. అత్యంత సూక్ష్మమైన స్ఫటికాల రూపంలో ఉంటుంది. కొన్ని కణాలు 60 మైక్రోమీటర్ల పరిమాణం కలిగి ఉంటాయని పరిశోధనలు వెల్లడించాయి. అగ్నిపర్వతం నుంచి వెలువడే వాయువులతో కలిసి ఇవి దాదాపు వెయ్యి కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించి చివరకు అంటార్కిటికా మంచుపై పడతాయి.
బంగారం కణాలు అగ్నిపర్వతాల నుంచి బయటకు రావడం కొత్త విషయం కాదు. హవాయిలోని కిలౌయా, ఇటలీలోని ఎట్నా, అలాస్కాలోని ఆగస్టిన్, మెక్సికోలోని ఎల్ చిచోన్ అగ్నిపర్వతాల దగ్గర కూడా స్వల్ప స్థాయిలో ఇలాంటి ఆనవాళ్లు గుర్తించారు. అయితే మౌంట్ ఎరెబస్లో ఈ ప్రక్రియ చాలా భిన్నంగా జరుగుతోంది.
ఈ బంగారం ఎలా ఏర్పడి గాల్లోకి చేరుతుందన్న ప్రశ్నకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు. కొందరు శాస్త్రవేత్తలు అగ్నిపర్వత వాయువులు చల్లబడే సమయంలో బంగారం స్ఫటికాలుగా మారుతుందని భావిస్తున్నారు. మరికొందరు మాత్రం లావా సరస్సు ఉపరితలంపైనే ఈ స్ఫటికాలు ఏర్పడి, తర్వాత వాయువులతో కలిసి గాల్లోకి ఎగిరిపోతాయని అంచనా వేస్తున్నారు. మూడు దశాబ్దాలకుపైగా పరిశోధనలు సాగుతున్నా ఈ రహస్యం ఇంకా వీడలేదు.