ఇది ప్రభాస్ రేంజ్.. బ్యాంకాక్‌లో పూరి జగన్నాథ్‌కు ఎదురైన ఊహించని అనుభవం!

This is Prabhas range Unexpected experience for Puri Jagannadh in Bangkok
  • బ్యాంకాక్‌లో దర్శకుడు పూరి జగన్నాథ్‌కు అరుదైన గౌరవం
  • ప్రభాస్ స్నేహితుడినని చెప్పడంతోనే వీఐపీ ట్రీట్‌మెంట్
  • 'బాహుబలి' డాక్యుమెంటరీలో ఘటనను వివరించిన ప్రభాస్
  • ఈ సంఘటనతో ప్రభాస్ గ్లోబల్ క్రేజ్ మరోసారి వెలుగులోకి
  • 'బాహుబలి 3'పై పరోక్షంగా హింట్ ఇచ్చిన చిత్రబృందం
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్ దేశ సరిహద్దులు దాటి ప్రపంచవ్యాప్తంగా ఏ స్థాయిలో విస్తరించిందో చెప్పే ఓ ఆసక్తికర సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. కేవలం 'నేను ప్రభాస్ స్నేహితుడిని' అని చెప్పినందుకు ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌కు బ్యాంకాక్‌లోని ఓ ఆసుపత్రిలో ఊహించని రీతిలో వీఐపీ ట్రీట్‌మెంట్ లభించింది. ఈ విషయాన్ని ప్రభాస్ స్వయంగా ఇటీవల విడుదలైన 'బాహుబలి: ది టార్చ్ బేరర్' అనే డాక్యుమెంటరీలో అభిమానులతో పంచుకున్నారు.

ప్రభాస్ కథనం ప్రకారం.. 'బాహుబలి: ది బిగినింగ్' విడుదలై ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తున్న రోజుల్లో ఈ సంఘటన జరిగింది. దర్శకుడు పూరి జగన్నాథ్ ఓ చిన్న ఇన్ఫెక్షన్ కారణంగా చికిత్స కోసం బ్యాంకాక్‌లోని ఓ ప్రముఖ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ తన వంతు కోసం వెయిటింగ్ రూమ్‌లో కూర్చుని ఉండగా, ఓ నర్స్ ఆయన వద్దకు వచ్చి ఇండియా నుంచి వచ్చారా? అని అడిగింది. ఆయన అవునని సమాధానం ఇవ్వగానే, ఆమె వెంటనే 'బాహుబలి?' అని ప్రశ్నించింది.

ఆమె ప్రశ్నకు ఆశ్చర్యపోయిన పూరి జగన్నాథ్, తన ఫోన్‌లోని ఓ పర్సనల్ ఫొటోను చూపించారు. ఆ ఫొటోలో ఆయన ప్రభాస్‌తో కలిసి ఉన్నారు. తాను ప్రభాస్‌కు మంచి స్నేహితుడినని ఆ నర్స్‌కు వివరించారు. ఆ ఫొటో చూసిన నర్స్ వెంటనే ఆసుపత్రి సిబ్బందిని అప్రమత్తం చేసింది. దీంతో పూరి జగన్నాథ్‌కు ఎలాంటి వెయిటింగ్ సమయం లేకుండా నేరుగా ఒక ప్రత్యేక గదికి తీసుకెళ్లి, తక్షణమే వైద్య సేవలు అందించారు. ఈ అనూహ్య అనుభవాన్ని పూరి జగన్నాథ్ వెంటనే వాయిస్ మెసేజ్ రూపంలో ప్రభాస్‌కు పంపించారు.

ఆ సమయంలో దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, నిర్మాత శోభు యార్లగడ్డతో కలిసి ఉన్న ప్రభాస్, ఆ వాయిస్ మెసేజ్ విని ఆశ్చర్యానికి గురయ్యారు. జపాన్ వంటి దేశాల్లో 'బాహుబలి'కి, ప్రభాస్‌కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని వారికి తెలుసు. కానీ, ఎవరూ ఊహించని విధంగా బ్యాంకాక్‌లోని ఓ సాధారణ ఆసుపత్రిలో కూడా 'బాహుబలి' ప్రభావం ఈ స్థాయిలో ఉండటం చిత్రబృందాన్ని సైతం ఆశ్చర్యపరిచింది. ఇది ప్రభాస్ గ్లోబల్ స్టార్‌డమ్‌కు నిదర్శనంగా నిలిచింది.

ఇదే డాక్యుమెంటరీలో ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టిలు 'బాహుబలి 3' చిత్రంపై పరోక్షంగా కొన్ని హింట్స్ ఇవ్వడం అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఇక, ప్రభాస్ కెరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన వరుస పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో 'ఫౌజీ', సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్', అలాగే 'కల్కి 2898 ఏడీ' చిత్రానికి సీక్వెల్ కూడా ఆయన లైనప్‌లో ఉన్నాయి.
Prabhas
Puri Jagannadh
Baahubali
Bangkok Hospital
Baahubali The Torchbearer
Pan India Star

More Telugu News