దేవుడికి గాయమైతే భక్తుడు తట్టుకోగలడా.. పవన్ కల్యాణ్ ఆరోగ్యంపై బండ్ల గణేశ్ భావోద్వేగ పోస్ట్
- భుజానికి శస్త్రచికిత్స చేయించుకోవాలని పవన్‌కు వైద్యుల సూచన
- రొటేటర్ కఫ్‌తో పాటు రెండు కండరాల్లో తీవ్ర గాయాలని నిర్ధారణ
- 'గబ్బర్ సింగ్' షూటింగ్ సమయంలో ఈ గాయాలైనట్లు వెల్లడి
- నిర్మాత కోసం నొప్పితోనే సినిమా పూర్తి చేశారని బండ్ల ప్రశంస
పవన్ కల్యాణ్ కొంతకాలంగా ఈ గాయాలతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. అయితే, ఈ గాయం వెనుక ఉన్న నేపథ్యాన్ని, నాటి సంఘటనలను గుర్తుచేసుకుంటూ ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్ సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్ పెట్టారు. ఈ గాయాలు సుమారు 15 ఏళ్ల క్రితం ‘గబ్బర్ సింగ్’ సినిమా షూటింగ్ సమయంలో తగిలినవని ఆయన వెల్లడించారు.
"నిన్న రాత్రంతా నిద్ర రాలేదు.. ఒకటే ఆలోచన.. ఒకటి కాదు రెండు కాదు దాదాపు పదిహేనేళ్లుగా మీరు నడుము నొప్పి, భుజం నొప్పితో ఎంత నరకం అనుభవించారో తలచుకుంటే నా గుండె బరువెక్కిపోయింది. చిన్న పంటి నొప్పి వచ్చినా మనిషి విలవిల్లాడిపోతాడు. అలాంటిది మీరు ఇన్ని సంవత్సరాలు ఆ బాధను చిరునవ్వు వెనుక దాచుకుని జీవించడం నిజంగా అసాధారణం. నాకు ఈ రోజు కూడా గబ్బర్ సింగ్ షూటింగ్ రోజులు కళ్లముందే కనిపిస్తున్నాయి. గుజరాత్లో జరిగిన ఆ ప్రమాదం.. గుర్రం మీద నుంచి పడిపోయిన ఆ క్షణం.. వైద్యులు వెంటనే ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పిన సందర్భం.. ఇవన్నీ ఇప్పటికీ నా మనసును వెంటాడుతూనే ఉన్నాయి. ఆ సమయంలో మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు. అది ఒక హీరో తీసుకున్న నిర్ణయం కాదు.. మాటకు ప్రాణం ఇచ్చే మహామనిషి తీసుకున్న నిర్ణయం.
'ముందు సినిమా పూర్తి చేద్దాం.. నిర్మాతకు ఇబ్బంది కలగకూడదు.. ఇన్ని వందల మంది కష్టపడుతున్నారు..' అని మీ శరీరం భరించలేని నొప్పిని గుండెల్లో దాచుకుని, ఆపరేషన్‌ను వాయిదా వేసి, షూటింగ్ పూర్తి చేసి, సినిమా విడుదలయ్యే వరకు మాకు అండగా నిలిచారు. ఒక నిర్మాతగా ఆ రోజున మీరు నాకు ఇచ్చింది ఒక హిట్ సినిమా మాత్రమే కాదు.. జీవితాంతం మర్చిపోలేని ఋణం. ఆ ఋణాన్ని నేను ఏ జన్మలోనూ తీర్చుకోలేను. ఈ రోజు మీ ఆరోగ్యం గురించి ఆలోచిస్తుంటే నా హృదయం ముక్కలవుతోంది. ఆ రోజున మీ బాధను నేను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయానేమో.. కానీ ఈ రోజు ఆ బాధ ఎంత పెద్దదో అర్థమవుతోంది. దేవుడిని ఒక్కటే కోరుకుంటున్నాను.. మీరు అనుభవించిన ప్రతి నొప్పికి ప్రతిఫలంగా ఇకపై మీ జీవితంలో ఆరోగ్యం, ఆనందం, ప్రశాంతత మాత్రమే ఉండాలి. ఎందుకంటే మీరు తెరపై మాత్రమే కాదు.. నిజ జీవితంలో కూడా ఎందరో మనుషుల జీవితాలను నిలబెట్టిన నిజమైన హీరో. మీరు ఆరోగ్యంగా నవ్వుతూ ఉండటమే.. మీపై ప్రేమ ఉన్న మా అందరికీ అతిపెద్ద సంతోషం" అంటూ బండ్ల గణేశ్ ఎమోషనల్ అయ్యారు.