రష్మిక చేతి ముద్రలతో దర్శకుడి షర్ట్.. 'మైసా' నుంచి క్రేజీ అప్డేట్
- 'మైసా' సినిమాపై దర్శకుడు రవీంద్ర పుల్లే ఆసక్తికర పోస్ట్
- రష్మిక చేతి ముద్రలున్న షర్ట్‌తో రక్తపు మరకలు రాబోతున్నాయి అని వ్యాఖ్య
- గిరిజన యువతి పాత్ర కోసం థాయ్‌లాండ్‌లో కఠిన శిక్షణ తీసుకున్న రష్మిక
- కేరళలో భారీ యాక్షన్ షెడ్యూల్ పూర్తి చేసిన చిత్ర యూనిట్
దర్శకుడి పోస్ట్‌పై రష్మిక కూడా సరదాగా స్పందించారు. "మనం ఈ అందమైన కళలో కొంచెం రక్తం, పసుపు కూడా కలిపి ఉండాల్సింది! తర్వాతిసారి కచ్చితంగా చేద్దాం" అని కామెంట్ చేశారు. నిర్మాణ సంస్థ అన్‌ఫార్ములా ఫిల్మ్స్ సైతం "మట్టిలో సంతకం.. రక్తంతో జ్ఞాపకం. 'మైసా' షూటింగ్ లో ఉంది. మునుపెన్నడూ చూడని రీతిలో భావోద్వేగాలను, ధైర్యాన్ని తెరపైకి తీసుకువస్తున్నాం. 2026లో సినిమా థియేటర్లలోకి వస్తుంది" అని ప్రకటించింది.
ఈ చిత్రంలో రష్మిక ఓ గిరిజన యువతిగా కనిపించనున్నారు. ఈ పాత్రకు శారీరక దృఢత్వంతో పాటు భావోద్వేగాలను పండించే నటన కూడా ఎంతో అవసరం. అందుకే ఈ సినిమాలోని భారీ యాక్షన్ సన్నివేశాల కోసం రష్మిక తీవ్రంగా శ్రమించారు. థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యాంప్‌లో ఆమె రోజుకు 8 గంటలకు పైగా కఠినమైన స్టంట్స్, పోరాట విద్యల్లో శిక్షణ పొందారు. అంతర్జాతీయ స్టంట్ కొరియోగ్రాఫర్ ఆండీ లాంగ్ ఈ సినిమా యాక్షన్‌ను పర్యవేక్షిస్తున్నారు.
కొద్ది నెలల క్రితం కేరళలో ఈ సినిమాకు సంబంధించిన ఓ సుదీర్ఘ షెడ్యూల్‌ను చిత్ర యూనిట్ పూర్తి చేసింది. ప్రముఖ స్టంట్ మాస్టర్ కెచా ఖంఫక్డీ నేతృత్వంలో ఈ షెడ్యూల్లో హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. ఇటీవలే ప్రముఖ కొరియోగ్రాఫర్ బృందా మాస్టర్ సారథ్యంలో ఓ పాట చిత్రీకరణ కూడా పూర్తయింది. ఈ చిత్రంలో ఈశ్వరీ రావు, గురు సోమసుందరం, రావు రమేశ్ కీలక పాత్రలు పోషిస్తుండగా, జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు.