గాంధీ, నెహ్రూ నడిచిన నేల.. పక్కనే ఉన్న ప్రాంతంతో ముడిపెడుతూ అవమానం!
- ముంబై గ్రాంట్ రోడ్ ప్రాంతంలోని 'కాంగ్రెస్ హౌస్’
- చారిత్రక భవనానికి తప్పుడు గుర్తింపు
- పక్కనే ఉన్న వ్యభిచార గృహాలే కారణం
- ఇబ్బందులు పడుతున్న స్థానిక కుటుంబాలు
1920లలో ఏర్పాటైన ఈ కాంగ్రెస్ హౌస్‌లో మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, మహమ్మద్ అలీ జిన్నా, సరోజినీ నాయుడు వంటి మహామహులు సమావేశాలు నిర్వహించారు. ప్రస్తుతం ఈ సముదాయంలో నివాస గృహాలు, చిన్న వ్యాపారాలు ఉన్నాయి. ఇక్కడికి తరచూ అపరిచిత వ్యక్తులు వస్తూ ఉండటంతో స్థానిక కుటుంబాలు, ముఖ్యంగా మహిళలు, పాఠశాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ హౌస్ ఆవరణలో ఉన్న ఒక బార్, వ్యభిచార గృహాల మధ్యవర్తులకు నిలయంగా మారడం కూడా ఈ అపవాదును మరింత పెంచుతోంది.
పూర్వం స్వాతంత్య్ర నిధుల కోసం ఇక్కడి కళాకారులు (తవాయిఫ్‌లు) కూడా విరాళాలు ఇచ్చి మద్దతుగా నిలిచారు. కాలక్రమేణా ఈ ప్రాంతం చుట్టూ భిన్నమైన సంస్కృతులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఈ అపఖ్యాతి వల్ల ఇక్కడి ఆస్తుల విలువలు తగ్గిపోవడమే కాకుండా, స్థానికుల దైనందిన జీవితంపై తీవ్ర ప్రభావం పడుతోంది. చారిత్రక పోరాటానికి, అణగారిన వర్గాల జీవనానికి సాక్ష్యంగా నిలిచిన ఈ ప్రాంత భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.