నన్ను సైతాన్ ఆవహించింది.. అందుకే రేప్ చేశా: కోర్టులో నిందితుడి వింత వాదన
- బ్రిటన్‌లో ఇద్దరు బాలికలపై అత్యాచారం
- 29 ఏళ్ల సుల్తానీ బకతాష్‌పై ఆరోపణలు
- బాలికలకు వోడ్కా తాగించి ఆపై దారుణానికి పాల్పడ్డాడన్న ప్రాసిక్యూషన్
- ఆఫ్ఘనిస్థాన్ నుంచి బ్రిటన్‌కు శరణార్థిగా వచ్చిన నిందితుడు
ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన సుల్తానీ బకతాష్ (29) గత డిసెంబర్‌లో బోల్టన్‌లోని తన ఫ్లాట్‌కు ఇద్దరు బాలికలను తీసుకొచ్చాడు. వారికి బలవంతంగా వోడ్కా తాగించాడు. అనంతరం వారు పూర్తిగా మత్తులోకి జారుకుని స్పృహ తప్పే స్థితికి చేరుకున్నప్పుడు వారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘోరానికి సంబంధించి అతడిపై రెండు రేప్ కేసులు, లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయి. అయితే కోర్టులో తాను నిర్దోషినని బకతాష్ వాదిస్తున్నాడు.
కోర్టు విచారణలో భాగంగా దుబాసి (అనువాదకుడు) సాయంతో నిందితుడు బకతాష్ తన సాక్ష్యాన్ని రికార్డు చేశాడు. ఆ రాత్రి మద్యం తాగిన తర్వాత తనకు విపరీతంగా తల తిరిగిందని, వాంతులు అయ్యాయని, ఆ తర్వాత ఏం జరిగిందో గుర్తులేదని చెప్పాడు. అంతేకాకుండా ఆ బాలికల వయసు 18 లేదా 19 ఏళ్లు ఉంటుందని తాను భావించినట్లు తెలిపాడు. ముస్లిం మతాచారాల ప్రకారం తాను సాధారణంగా మద్యం ముట్టనని చెబుతూ.. "ఆ రాత్రి నాపై సైతాన్ ఆవహించిందని అనుకుంటున్నాను. అందుకే ఆ బాటిల్ లోని మద్యం తాగాను, అది చాలా చేదుగా ఉంది" అని జ్యూరీ ముందు వింత వాదనలు వినిపించాడు.
2022లో అఫ్ఘనిస్థాన్‌లోని బ్రిటన్ సైన్యానికి సహాయకుడిగా పనిచేసిన బకతాష్.. తాలిబన్ల భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని యూకేకు శరణార్థిగా వచ్చాడు. ప్రస్తుతం బోల్టన్‌లో ఉంటూ ఇంగ్లిష్ నేర్చుకుంటున్నాడు. కాగా, నిందితుడు కావాలనే బాలికల బలహీనతను ఆసరాగా చేసుకుని ఈ దారుణానికి ఒడిగట్టాడని, శిక్ష నుంచి తప్పించుకోవడానికే సైతాన్ పై నెపం వేస్తున్నాడని ప్రాసిక్యూషన్ కోర్టుకు వివరించింది.