హైదరాబాద్‌లో ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’.. సంచలన గౌరవంపై ట్రంప్ భావోద్వేగ ట్వీట్!
- హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని ఓ ప్రధాన రోడ్డుకు ట్రంప్ పేరు
- పదవిలో ఉన్న అమెరికా అధ్యక్షుడికి ఈ తరహా గౌరవం చరిత్రలో ఇదే తొలిసారన్న ట్రంప్
- అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అధికారికంగా బోర్డు ఆవిష్కరణ
- అమెరికన్ దిగ్గజ సంస్థల కార్యాలయాలకు సమీపంలోనే ఈ కొత్త అవెన్యూ
- ఇరు దేశాల బంధానికి ప్రతీకగా రోడ్డు పేరు మార్చామన్న డిప్యూటీ సీఎం భట్టి
తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ట్రూత్ సోషల్'లో హైదరాబాద్‌లోని రోడ్డు ప్రారంభోత్సవ చిత్రాలను పంచుకుంటూ ట్రంప్ భావోద్వేగ పోస్ట్ పెట్టారు. "భారతదేశంలోని హైదరాబాద్‌లో నూతనంగా ఏర్పాటైన 'డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ'.. పదవిలో ఉన్న ఒక అమెరికా అధ్యక్షుడికి ఈ విధంగా గౌరవం దక్కడం చరిత్రలోనే ఇదే తొలిసారి. థాంక్యూ!" అని ఆయన పేర్కొన్నారు.
గతంలో ‘యూఎస్ కాన్సులేట్ రోడ్డు’గా పిలిచిన నానక్‌రామ్‌గూడ లోని ఈ రహదారి.. అమెరికా కాన్సులేట్ జనరల్ కార్యాలయానికి ఆనుకుని ఉంటుంది. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి ప్రపంచ ప్రసిద్ధ అమెరికన్ ఐటీ దిగ్గజాల క్యాంపస్‌లు కూడా ఈ రోడ్డు పరిసరాల్లోనే ఉన్నాయి. అమెరికాకు స్వాతంత్య్రం సిద్ధించి 250 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించిన ‘ఫ్రీడమ్ 250’ వేడుకల వేదికగా ఈ వారం ప్రారంభంలో నూతన నామకరణ ఫలకాన్ని అధికారికంగా ఆవిష్కరించారు.
భారత్-అమెరికా దేశాల మధ్య ఉన్న దృఢమైన ద్వైపాక్షిక సంబంధాలకు, గ్లోబల్ టెక్ హబ్‌గా అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ సాధిస్తున్న వృద్ధికి ఈ నిర్ణయం ఒక నిదర్శనమని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. 2025 చివరలో జరిగిన యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్‌షిప్ ఫోరమ్ సదస్సులోనే రేవంత్ రెడ్డి ఈ ప్రతిపాదనను ప్రకటించారు. కాగా, ఈ ప్రతిష్ఠాత్మక బోర్డు ఆవిష్కరణ కార్యక్రమంలో భారత పర్యటనలో ఉన్న అమెరికా రాయబారి సెర్గియో గోర్, తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కలు స్వయంగా పాల్గొన్నారు.