టాలీవుడ్లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్న 'వందేమాతరం' తనయుడు
- హీరోగా పరిచయమవుతున్న వందేమాతరం శ్రీనివాస్ కుమారుడు సుస్వర తరంగ్
- టాలీవుడ్లో అడుగుపెడుతున్న మరో సినీ వారసుడు
- రొమాంటిక్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న చిత్రం
- పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సినిమా
- జూన్ 29 నుంచి రెగ్యులర్ షూటింగ్
సుస్వర తరంగ్ హీరోగా వీరేష్ కోకా దర్శకత్వంలో ఓ రొమాంటిక్ థ్రిల్లర్ తెరకెక్కుతోంది. సురవి విజన్స్ బ్యానర్‌పై పి. చక్రధర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా శుక్రవారం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు డాలీ క్లాప్ కొట్టగా, గంటా రవితేజ (టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు కుమారుడు) కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ప్రముఖ నిర్మాత నల్లమలుపు బుజ్జి చిత్రబృందానికి స్క్రిప్ట్ అందజేశారు.
ఈ చిత్రంలో సుస్వర తరంగ్ సరసన దివ్యాని మొండల్ హీరోయిన్గా నటిస్తోంది. ఎస్. చంద్రశేఖరన్ సినిమాటోగ్రాఫర్‌గా, బిబిన్ అశోక్ సంగీత దర్శకుడిగా, నిరంజన్ దేవరమానే ఎడిటర్‌గా వ్యవహరించనున్నారు. ఈ నెల 29 నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని చిత్ర యూనిట్ వెల్లడించింది. తండ్రిలాగే తనయుడు కూడా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకుంటాడో లేదో చూడాలి.



