విద్యావ్యవస్థలో మార్పు మీరే తేవాలి: ఉపాధ్యాయులకు మంత్రి లోకేశ్ దిశానిర్దేశం
- సింగపూర్ యాత్రకు వెళ్లిన 37 మంది టీచర్లతో మంత్రి లోకేశ్ భేటీ
- విద్యా వ్యవస్థలో మార్పునకు ఉపాధ్యాయులే నాయకత్వం వహించాలని పిలుపు
- మంచి ఫలితాలు సాధించే ఉపాధ్యాయులకు గుర్తింపు ఇస్తామని హామీ
- అందరం కలిసి 'ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్' సాధిద్దామన్న లోకేశ్
ఈ సందర్భంగా, సింగపూర్ పర్యటనలో తాము తెలుసుకున్న అధునాతన విద్యా విధానాలు, బోధనా పద్ధతులను ఉపాధ్యాయులు మంత్రికి వివరించారు. రాష్ట్రంలోని పాఠశాలల్లో వాటిని అమలు చేయడానికి ఉన్న అవకాశాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఉపాధ్యాయులు చెప్పిన విషయాలను లోకేశ్ ఆసక్తిగా విన్నారు.
అనంతరం ఉపాధ్యాయులను ఉద్దేశించి లోకేశ్ మాట్లాడుతూ.. విద్యావ్యవస్థలో మార్పు తీసుకురావడంలో ఉపాధ్యాయుల పాత్రే అత్యంత కీలకమని స్పష్టం చేశారు. కష్టపడి పనిచేసి మంచి ఫలితాలు సాధించే ఉపాధ్యాయులకు ప్రభుత్వం తప్పకుండా గుర్తింపునిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్ర విద్యారంగాన్ని ఉన్నత ప్రమాణాలతో తీర్చిదిద్దడమే లక్ష్యమని, ఈ ప్రయాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని లోకేశ్ దిశానిర్దేశం చేశారు.

