అల్లు సినిమాస్ లో 'నాగబంధం' రెడ్ కార్పెట్ ప్రీమియర్
- విడుదలకు ఒక రోజు ముందు 'నాగబంధం' స్పెషల్ ప్రీమియర్
- జూలై 2న అల్లు సినిమాస్ డాల్బీసినిమా థియేటర్ లో రెడ్ కార్పెట్ ఈవెంట్
- అభిషేక్ నామా దర్శకత్వంలో వస్తున్న ఫాంటసీ అడ్వెంచర్ చిత్రం
- జూలై 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న సినిమా
ఈ ప్రత్యేక ప్రదర్శన కోసం చిత్రబృందం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అభిషేక్ నామా స్వీయ దర్శకత్వంలో కథ, స్క్రీన్‌ప్లే అందిస్తూ ఈ చిత్రాన్ని రూపొందించారు. 'ఒక పురాణ గాథకు నాంది' అంటూ ప్రచారం చేస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఫాంటసీ, అడ్వెంచర్ అంశాలతో కూడిన ఈ కథాంశం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
లక్ష్మీ ఇరా, దేవాన్ష్ నామా సమర్పణలో వస్తున్న ఈ చిత్రాన్ని కిషోర్ అన్నపురెడ్డి, నిషితా నాగిరెడ్డి నిర్మిస్తున్నారు. అల్లు సినిమాస్, 7 స్టూడియోస్ కూడా నిర్మాణంలో భాగస్వాములుగా ఉన్నాయి. ఈ సినిమాకు ప్రైమ్ వీడియో డిజిటల్ స్ట్రీమింగ్ పార్ట్‌నర్‌గా వ్యవహరిస్తోంది. ఈ ప్రీమియర్ వేడుకతో సినిమాపై అంచనాలను మరింత పెంచేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.
ఈ చిత్రంలో విరాట్ కర్ణ ప్రధాన పాత్రలో నటించగా... నభా నటేష్, ఐశ్వర్య మీనన్ కథానాయికలు. జగపతిబాబు, మహేశ్ మంజ్రేకర్, మురళి శర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.