స్నేహితుడి బర్త్డే పార్టీకి వెళ్లి... లండన్లో తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద మృతి
- లండన్లో తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద మృతి
- కామారెడ్డి జిల్లాకు చెందిన సావుసాని శ్రీనాథ్ రెడ్డిగా గుర్తింపు
- స్నేహితుడి పుట్టినరోజు వేడుకకు వెళ్లి మరుసటి రోజు మరణం
కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం తలమడ్ల గ్రామానికి చెందిన శ్రీనాథ్ రెడ్డి, గతేడాది ఉన్నత చదువుల కోసం యూకే వెళ్లాడు. అక్కడ లీసెస్టర్ యూనివర్సిటీలో ఎంఎస్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. రెండు రోజుల క్రితం స్నేహితుడి పుట్టినరోజు వేడుకకు హాజరై, రాత్రి అక్కడే బస చేశాడు. మరుసటి రోజు ఉదయం ఎంతసేపటికీ నిద్రలేవకపోవడంతో స్నేహితులు గమనించగా, అప్పటికే అచేతనంగా పడి ఉన్నాడు.
ఈ విషయాన్ని స్నేహితులు వెంటనే శ్రీనాథ్ తల్లిదండ్రులైన మధుసూదన్ రెడ్డి, మంజులకు, బంధువులకు తెలియజేశారు. ఉజ్వల భవిష్యత్తు కోసం విదేశాలకు పంపిన కుమారుడు విగతజీవిగా మారాడన్న వార్తతో వారు గుండెలవిసేలా రోదిస్తున్నారు. తమ కుమారుడి మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి రప్పించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని వారు వేడుకుంటున్నారు.