చరిత్ర సృష్టించిన కింగ్ చార్లెస్: సొంత పన్నుల వివరాలు వెల్లడించిన తొలి బ్రిటన్ రాజు!
- కింగ్ చార్లెస్ వ్యక్తిగత పన్నుల వెల్లడితో సరికొత్త రికార్డు
- సింహాసనం అధిష్టించినప్పటి నుంచి రూ. 320 కోట్లకు పైగా పన్ను చెల్లింపు
- చట్టపరమైన మినహాయింపులు ఉన్నప్పటికీ స్వచ్ఛందంగా పన్ను కట్టిన రాజు
- యూకేలోనే అత్యధిక పన్నులు కట్టే టాప్ 100 మంది వ్యక్తుల్లో స్థానం
- బకింగ్‌హామ్ ప్యాలెస్ పునరుద్ధరణ ముగిసినా అక్కడికి మారబోనని స్పష్టీకరణ
గురువారం బకింగ్‌హామ్ ప్యాలెస్ విడుదల చేసిన వార్షిక ఆర్థిక నివేదికల ప్రకారం.. సెప్టెంబర్ 2022లో రాజుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కింగ్ చార్లెస్ రూ. 320 కోట్లకు పైగా (30 మిలియన్ పౌండ్లు) వ్యక్తిగత పన్నులు చెల్లించారు. ఒక్క 2024-25 ఆర్థిక సంవత్సరంలోనే ఆయన ఆదాయ, మూలధన లాభాల పన్నుల కింద దాదాపు రూ. 140 కోట్లు (12.9 మిలియన్ పౌండ్లు) కట్టారు. దీంతో యునైటెడ్ కింగ్‌డమ్‌లోనే అత్యధిక పన్ను చెల్లించే టాప్ 100 మంది వ్యక్తుల జాబితాలో బ్రిటన్ రాజు నిలిచారు. ఇదే సమయంలో ప్రిన్స్ విలియం కూడా దాదాపు రూ. 84 కోట్ల (7.76 మిలియన్ పౌండ్లు) పన్ను చెల్లించినట్లు ప్రకటించారు.
నిజానికి బ్రిటన్ చట్టాల ప్రకారం రాజులు ఆదాయ, వారసత్వ పన్నులు కట్టాల్సిన అవసరం లేదు. కానీ, తన తల్లి క్వీన్ ఎలిజబెత్ II 1993లో నెలకొల్పిన సంప్రదాయాన్ని కొనసాగిస్తూ కింగ్ చార్లెస్ స్వచ్ఛందంగా ఈ పన్నులు చెల్లించారు. ఈ వివరాలను ప్రజల ముందు ఉంచడం రాజు వ్యక్తిగత నిర్ణయమని ప్యాలెస్ అధికారులు తెలిపారు. చారిత్రాత్మక 'డచీ ఆఫ్ లాంకాస్టర్' తో పాటు శాండ్రింగ్‌హామ్, బాల్మోరల్ వంటి ప్రైవేట్ ఎస్టేట్ల ద్వారా వచ్చే ఆదాయంపై ఈ పన్నులు లెక్కించారు.
ఇదే నివేదికలో రాచకుటుంబం మరో కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. దాదాపు రూ. 4,000 కోట్ల (369 మిలియన్ పౌండ్లు) వ్యయంతో పదేళ్లుగా జరుగుతున్న బకింగ్‌హామ్ ప్యాలెస్ పునరుద్ధరణ పనులు వచ్చే ఏడాది పూర్తి కానున్నాయి. అయినప్పటికీ, కింగ్ చార్లెస్, క్వీన్ కమిల్లా దంపతులు అక్కడికి మారకూడదని నిర్ణయించుకున్నారు. బకింగ్‌హామ్ ప్యాలెస్‌ను కేవలం అధికారిక కార్యకలాపాలకు హెడ్‌క్వార్టర్స్‌గా మాత్రమే వాడతామని, తాము ప్రస్తుత నివాసమైన క్లారెన్స్ హౌస్‌లోనే ఉంటామని స్పష్టం చేశారు.