ఎల్పీజీపై కేంద్రం కీలక నిర్ణయం.. ఆంక్షల ఎత్తివేత
- వాణిజ్య ఎల్పీజీ సరఫరాపై ఆంక్షలు ఎత్తివేత
- బల్క్ ఎల్పీజీ సరఫరాలు 50% మేర పునరుద్ధరణ
- అమెరికా-ఇరాన్ ఒప్పందంతో మెరుగైన దిగుమతులు
- హోటళ్లు, పరిశ్రమలకు భారీ ఊరట
- దేశీయ ఎల్పీజీ ఉత్పత్తి రోజుకు 40 వేల టన్నుల కంటే తగ్గదని హామీ
సంక్షోభం సమయంలో నిలిపివేసిన బల్క్ ఎల్పీజీ సరఫరాలను కూడా ఇప్పుడు 50 శాతం మేర పునరుద్ధరించారు. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న పరిశ్రమలు, వాణిజ్య సంస్థలకు ఉపశమనం లభించనుంది. పశ్చిమాసియా సంక్షోభం సమయంలో దేశీయ వినియోగదారులకు ఎలాంటి కొరత రాకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఎల్పీజీ ఉత్పత్తి కోసం అవసరమైన C3-C4 గ్యాస్ వనరులను ఇతర రంగాలకు మళ్లించకుండా, పూర్తిగా గృహ వినియోగ ఎల్పీజీ తయారీకి కేటాయించింది. ఇప్పుడు పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకోవడంతో ఆ పరిమితులను కూడా సడలించింది.
అయితే దేశీయ ఎల్పీజీ ఉత్పత్తి రోజుకు కనీసం 40 వేల మెట్రిక్ టన్నుల కంటే తగ్గకుండా చర్యలు కొనసాగుతాయని కేంద్రం స్పష్టం చేసింది. అదే సమయంలో పెట్రోకెమికల్ రంగం అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకుని C3-C4 వనరుల కేటాయింపును పెంచనుంది. ఇక పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్‌జీ) విస్తరణపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటికే ఈ గ్యాస్ వినియోగిస్తున్న వాణిజ్య సంస్థలు అదే విధానంలో కొనసాగుతాయని స్పష్టం చేసింది. నెట్‌వర్క్ అందుబాటులో ఉన్న ఇతర వినియోగదారులను కూడా దశలవారీగా పీఎన్‌జీ వైపు మళ్లించనున్నట్లు తెలిపింది.