ఉద్యోగులకు భారీ భరోసా.. ఉచిత బీమా, పీఆర్సీపైనా సీఎం హామీ

Revanth Reddy assures free insurance and PRC for Telangana employees
  • రాష్ట్ర ఉద్యోగులు, పెన్షనర్లకు ఉచిత ప్రమాద బీమా
  • 14 బ్యాంకులతో తెలంగాణ ప్రభుత్వం ఎంఓయూలు
  • కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కూడా వర్తింపు
  • ప్రమాద బీమా కవరేజీ రూ.1 కోటి నుంచి రూ.1.5 కోట్లు
  • విమాన ప్రమాద బీమా రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్లు
  • పీఆర్సీ హామీని తప్పకుండా అమలు చేస్తామని సీఎం స్పష్టం
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రెగ్యులర్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, ఇతర తాత్కాలిక ఉద్యోగులకు కూడా ఉచిత ప్రమాద బీమా సదుపాయం కల్పించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు 14 బ్యాంకులతో ప్రభుత్వం అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో సీఎం స్వయంగా ఒప్పందాలపై సంతకాలు చేసి పథకాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం, ప్రభుత్వం కోసం కష్టపడే ఉద్యోగుల భద్రతను కాపాడటం తమ బాధ్యత అని చెప్పారు. ఉద్యోగులు అడగక ముందే ప్రభుత్వం ముందడుగు వేసి ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. పదవీ విరమణ తర్వాత కూడా బీమా ప్రయోజనాలు కొనసాగించేలా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.

ప్రమాద బీమా కింద ఉద్యోగులకు రూ.1 కోటి నుంచి రూ.1.5 కోట్ల వరకు కవరేజీ లభిస్తుందని తెలిపారు. విమాన ప్రమాదాల సందర్భంలో బ్యాంకులు రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు బీమా రక్షణ అందిస్తాయని వివరించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ఉద్యోగులందరికీ సీఎం కృతజ్ఞతలు తెలిపారు.

ఉద్యోగుల సంక్షేమంపై ప్రభుత్వం కట్టుబడి ఉందని రేవంత్‌ స్పష్టం చేశారు. పీఆర్సీ విషయంలో ఇచ్చిన హామీని కూడా తప్పకుండా అమలు చేస్తామని చెప్పారు. ఉద్యోగుల నమ్మకమే ప్రభుత్వానికి బలమని, ప్రభుత్వాలు మారినా ఉద్యోగ వ్యవస్థ శాశ్వతమని పేర్కొన్నారు.

గత ప్రభుత్వ హయాంలో జీతాలు చెల్లించలేని పరిస్థితి ఉండేదని విమర్శించిన సీఎం విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెలా తొలి రోజే జీతాలు చెల్లిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ఆదాయం పెరిగేలా ఉద్యోగులు ప్రతిరోజూ అదనంగా గంట పనిచేయాలని కోరారు. వచ్చే అదనపు ఆదాయాన్ని ఉద్యోగుల సంక్షేమానికే వినియోగిస్తామని హామీ ఇచ్చారు.

అనంతరం రాజకీయ అంశాలపైనా స్పందించిన సీఎం తాను ‘‘గుంపు మేస్త్రీ’’నని, రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసే తన బృందానికి నాయకత్వం వహిస్తున్నానని అన్నారు. మూసీ నది ప్రక్షాళన, మెట్రో విస్తరణ వంటి అభివృద్ధి కార్యక్రమాలకు ప్రతిపక్షాలు అడ్డంకులు సృష్టిస్తున్నాయని ఆరోపించారు.
Look at Shorts
Revanth Reddy
Telangana Government Employees
Free Accident Insurance
Telangana PRC
Government Employee Benefits
Telangana State News

More Telugu News